బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై మరో కేసు

నవతెలంగాణ – హైదరాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహెల్‌పై మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్‌ ముందు బారికేడ్లను ఢ కొట్టిన కేసులో అరెస్టయిన రాహెల్‌ను.. రెండేండ్ల క్రిత జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు నిందితుడిగా చేర్చారు. 2022లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్‌ చౌహాన్‌ అనే మహిళను కారు ఢీ కొట్టింది. దీంతో తన చేతిలో ఉన్న రెండు నెలల శిశువును ఆమె వదిలేయడంతో.. కిందపడి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దానిని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటంతో దానిని బోధన్‌ అప్పటి ఎమ్మెల్యే షకీల్‌కు చెందిందిగా గుర్తించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.
ఘటన సమయంలో కారులో షకీల్‌ కొడుకు రాహెల్‌, అతని స్నేహితులు ఆఫ్నాన్‌, మాజ్‌ ఉన్నట్లు గుర్తించారు. అయితే సీసీ ఫుటేజీ లభించకపోవడంతో కారు ఎవరు నడిపారనే విషయమై స్పష్టత రాలేదు. కాగా, తానే కారును నడిపిట్లు అఫ్నాన్‌ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. కాజోల్‌ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో కారు ఢ కొట్టిందనీ, భయంతో తాము పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. అనంతరం అతడిని అరెస్టు చేసి చార్జీషీట్‌ దాఖలుచేశారు.
అయితే ప్రజాభవన్‌ ప్రమాదం నేపథ్యంలో షకీల్‌ కొడుకు పాత్రపై అనుమానంతో పోలీసులు మరోసారి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు కాజోల్‌తోపాటు అప్పట్లో లొంగిపోయిన ఆఫ్నాన్‌ వాంగ్మూలం సేకరించారు. ఈ సందర్భంగా కారు నడిపింది రాహెల్‌ అని చెప్పడంతో తాజాగా అతనిపై కేసు నమోదుచేశారు.

Spread the love