హస్తం తీర్ధానికి సెస్ పాలక వర్గం ?

– ఛైర్మన్ మినహా డైరెక్టర్లు రహస్య సమావేశం
– ఖాళీ కానున్న బీఆర్ఎస్ డైరెక్టర్లు
నవతెలంగాణ – చందుర్తి
ఎవరికి వారు ప్రత్నామ్నాయం మాత్రం చూసుకుంటున్నారు. ఏముంది ఎమ్మెల్యేలే పార్టీ మారుతున్నారు అంతకన్నా మనమేమన్న గొప్పోల్లమా! అనుకుంటున్న నాయకులు  చర్చించుకోవడమే కాదు. అన్నా నేను బీఅర్ఎస్ లో ఉండలేను. పదవి ఉన్న పవర్ లేకుండా ప్రజలకు న్యాయం చేయలేము అంటూ ఈ మధ్యలో నాయకుల మాటలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అయిన సంగతి విదితమే. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో,  వివిధ పార్టీల నాయకుల వలసల పర్వం సాగుతోంది. సోమవారం రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య,  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.
సెస్ డైరెక్టర్ల రహస్య సమావేశం:
ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ విజయం సాధించగా సెస్ ఛైర్మన్ రామారావు , వైస్ ఛైర్మన్ దేవర కొండ తిరుపతి కలసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. దీంతో ఈ మధ్య కాలంలో  సెస్ వైస్ ఛైర్మన్ తిరుపతి సమక్షంలో డైరెక్టర్లు ఓ రహస్య ప్రాతంలో సమావేశం అయినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీ సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మనం పదవిలో ఉన్నాం..కానీ అధికారంలో మన ప్రభుత్వం లేదు.  మనం ప్రజలకు న్యాయం చేయలేము. అందుకు అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరితే మనకు సేఫ్టీ. మనం ప్రజలకు అభివృద్ది పనులు చేయడానికిన ఇంతకు మించిన ప్రత్నామ్నాయం లేదని చర్చించుకున్నట్లుగా జిల్లాలోని ఓ నాయకుడు నవతెలంగాణతో తెలిపాడు.
ఖాళీ కానున్న బీఆర్ఎస్ పాలకవర్గం
జిల్లాలో పదమూడు మంది సెస్ డైరెక్టర్లు ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. ఛైర్మన్ మినహా మిగతా పన్నెండు మంది డైరెక్టర్లు ఎంపీ ఎన్నికలకు ముందా? తర్వాతనా? కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం కోసం  సిద్ధంగా ఉన్నట్లుగా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Spread the love