నవతెలంగాణ-హైదరాబాద్ : పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. ఉడ్రాజవరం మండలం మోర్తకు చెందిన కే.శివరాకృష్ణకు వడలికి చెందిన కోదాడ సత్యవాణితో ఈ నెల 15న వివాహమైంది. నూతన వధూవరులు మంగళవారం రాత్రి సినిమాకు వెళ్తున్నామని చెప్పి బైక్‌పై బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. అయితే వరుడు ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఆమెకోసం గాలింపు చేపట్టారు. తణుకులోని ప్రవేటు దవాఖానలో చికిత్సం పొందుతున్న శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ ఏదో నాటకమాడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.