చెప్పేవాడు.. వినేవాడు..

‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అంటారు పెద్దలు. తెలంగాణ ఉద్యమ సమయంలో, వైఎస్సార్‌ సీఎంగా ఉండగా గులాబీ బాస్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే ఈ నానుడి గుర్తుకు రాక మానదు. అప్పట్లో వైఎస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ రెండోసారి (2009లో) అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి ప్రధాన ప్రతిపక్షం సైకిల్‌ పార్టీతో పాటు కారు పార్టీలో దిగ్గజాలుగా ఉన్న సీనియర్లు, ట్రబుల్‌ షూటర్లుగా ఉన్న వారు సైతం వైఎస్‌తో భేటీ అయ్యారు. సెకండ్‌ టైమ్‌ విక్టరీ సాధించిన రాజశేఖరుడిని పూలదండలతోనూ, పొగడ్తలతోనూ ముంచెత్తారు. ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆ క్రమంలో వారందరూ, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి పలువురు ‘అభయ హస్తం’ అందుకునేందుకు రెడీ అయ్యారు. ఒక మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం కారు సారుకు తెలిసింది. అంతే ఒంటికాలి మీద శివాలెత్తిన ఆయన… ‘ఏం రాజశేఖరరెడ్డీ.. మా పార్టీ అంటే ఏమనుకుంటున్నవ్‌..? ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తావ్‌..? నువ్వు ఇట్ల జేస్తే తెలంగాణ, ఇక్కడి ప్రజలు ఊరుకుంటరనుకున్నవా..? చీరి చింతకడ్తరు జనాలు.. జాగ్రత్త. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు జేయాల్సిన పని ఇదేనా..? ఖబర్దార్‌…’ అంటూ ఆనాటి సీఎం మీద అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాలం గిర్రును తిరగింది. దాదాపు పద్నాలుగేండ్లు గడిచిపోయాయి. ఈ కాలంలో తెలంగాణ వచ్చింది. గులాబీ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం పదేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన జంప్‌ జిలానీలు, ఫిరాయింపులను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 2014 నుంచి 2018 వరకూ, ఆ తర్వాత ఇప్పటి వరకూ కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీల నుంచి ‘గులాబీ తీర్థం’ పుచ్చుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అయితే ఇక్కడ సగటు ఓటరు మెదళ్లలో మెదిలేది ఒకే ఒక్క ప్రశ్న…’ఆనాడు రాజశేఖరరెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహించారు, మన సారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శభాష్‌.. బాగానే ఉంది. కానీ ఈనాడు అదే తెలంగాణలో ఫిరాయింపులు, వలసలను ప్రోత్సహిస్తున్నదెవరు..? తద్వారా ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నదెవరు…? మనం ఇప్పుడు ఎవరి మీద కోపం వెళ్లగక్కాలే…?’ జర మీరైనా సమాధానం చెప్పి పుణ్యం కట్టుకోండి…
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love