పవరా?మజాకా?

‘పవర్‌’లో ఎంత పవర్‌ ఉందో ఏమోగానీ అది లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు. పవర్‌ కోసం ఎంత దూరమైనా వలసపోతున్నారు. ఎక్కడైతే పదవి సునాయసంగా దొరుకుతుందో అన్ని వదిలి అక్కడికి సిగ్గు లేకుండా పోతున్నారు. ‘ఎవరేమనుకుంటే నాకేంటి సిగ్గు’ అన్నట్టు…ఎన్నికల వేళ ఎక్కడ చూసిన ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఇన్నాళ్లు సొంత పార్టీ ఇచ్చిన గుర్తింపు గౌరవం, పదవులు సైతం బలాదూర్‌ అంటున్నారు. ఓ పార్టీలో టికెట్‌ దక్కకపోతే ఇక జీవితమే లేదన్నట్టు ఊగిపోతున్నారు. ఫలానా పార్టీ టికెట్‌ ఇవ్వలేదా? వెంటనే మరోపార్టీలోకి వెళ్లి కండువా కప్పుకుని యమదర్జాగా తిరుగుతున్నారు. నిన్న గులాబీ కండువా? నేడు కషాయం కండువా? ఎల్లుండి మూడు రంగుల కండువా? రంగు ఏదైనా పవరే ముఖ్యం. కాంగ్రెస్‌లో ఉండి బీఆర్‌ఎస్‌పై విమర్శలు, బీజేపీలోకి పోయి బీఆర్‌ఎస్‌పై విమర్శలు. మళ్లి వాటిని సమర్థించుకోవడానికి కూడా సిగ్గు పడటం లేదు. ఇలాంటి నేతలను చూసి కప్పలు సైతం సిగ్గు పడుతున్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడి ఎగురడం వాటి సహజ గుణం. ఈ నాయకులు మమ్మల్ని మించిపోయారు అని నవ్వుకుంటున్నాయి. పదవి, పవర్‌ వచ్చేదాక కూడా ఓపిక పట్టడం లేదు. రాజకీయ విలువలు లేవు. సిద్ధాంతాలు అంతకన్నా కనపడవు. ప్రజా సమస్యలు పట్టవు. పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారోనన్న సోయి కూడా లేదు. ఆ పార్టీలోకి పోతే నాకేం వస్తుంది. నా కుటుంబానికేం వస్తుంది. అనేదే తప్ప… వేరే ధ్యాసే లేదు. అందుకే రాత్రికి రాత్రి కండువాలు మార్చు కుంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇంకేన్నీ చిత్రాలు చూడాల్సి వస్తుందో?
– గుడిగ రఘు

Spread the love