ప్రధాని తాపీ మేస్త్రీ ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీ

The Prime Minister is a mason The chief minister is a mason– పదేండ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి
– రాముడి పేరుతో రాజకీయం చేసే బీజేపీని తరిమేద్దాం..
– హామీలను అమలు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడుతాం
– ట్యాపింగ్‌లపై శ్రద్ధ వాటార్‌ ట్యాప్‌లపై పెట్టండి
– ఈటలకు ఓటేసినా ఉపయోగం లేదు
– కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ-బోడుప్పల్‌
‘రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని, తరిమేద్దాం.. సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ.. ఇద్దరూ కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు’ అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అమలుకు సాధ్యంకానీ హామీలు ఇచ్చి మోసపూరితమైన విధానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. వాటిని అమలు చేసే వరకూ ప్రజల తరుపున వెంటాడి వేటాడి తరుముతామని హెచ్చరించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం జరిగిన ఉమ్మడి ఘట్కేసర్‌ మండల బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కౌశిక్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల మాదిరి జీవితంలో కూడా అన్నీ ఉంటాయని.. స్వలాభం కోసం కొంత మంది నాయకులు ఇతర పార్టీలకు వెళ్లినా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని తెలిపారు. రైతులకిచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్‌ నెరవేర్చలేదని, మహాలక్ష్మి పథకం ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రుణమాఫీకి దిక్కులేదన్నారు. ఒక ముఖ్యమంత్రిలా రేవంత్‌రెడ్డి మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని, రేవంత్‌ రెడ్డి పక్కనే కొందరు ఉన్నారని, వాళ్లే ఆయనను ఇబ్బంది పెడతారని చెప్పారు. రేవంత్‌ ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ మీద పెట్టిన శ్రద్ధ మంచినీళ్ల మీద పెట్టాలని సూచించారు. రైతుబంధు, దళిత బంధు, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ గిఫ్ట్‌, బతుకమ్మ చీరలు సహా అన్నీ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర అని దేశమంతా తిరుగుతుంటే.. రేవంత్‌ రెడ్డి ప్రధాని మోడీ తన పెద్దన్న అంటాడని.. లిక్కర్‌ స్కామ్‌ జరగలేదని రాహుల్‌ అంటే.. లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని రేవంత్‌ అంటాడని ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా రేవంత్‌ రెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడం కోసమైనా బీజేపీలో చేరతారన్నారు. ప్రజలందరూ ఆలోచించాలని, ఎవరు సంక్షేమ పథకాలు అందించారో వారికి ఓటు వేయాలని కోరారు. పదేండ్లుగా తెలంగాణకు ప్రధాని మోడీ రూపాయి ఇచ్చింది లేదు, రూపాయి కూడా రుణమాఫీ చేసింది లేదన్నారు. భద్రాచలం రాముడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. బీజేపీ మతోన్మాదాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈటలకు ఓటు వేసినా హుజురాబాద్‌ వెళ్లిపోతాడని, అందువల్ల లోకల్‌ అభ్యర్థి రాగిడిని గెలిపించాలని కోరారు.
మాజీ మంత్రి మాల్లారెడ్డి మాట్లాడుతూ.. రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీ ఖాయమని.. 20 ఏండ్లుగా ప్రజా సేవలో ఉన్న వ్యక్తి రాగిడి అన్నారు. రెండు జాతీయ పార్టీలు కలిసినా బీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేవని చెప్పారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ అంటే ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో ఉన్నాయని, దీనిని ప్రజలు గమనించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి హుజురాబాద్‌ను ఈటల అభివృద్ధి చేసింది లేదన్నారు. ఒక్కరోజు కూడా బొట్టు పెట్టని ఈటల నేడు హిందూత్వం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై కావాలనే మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ నుంచి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు.

Spread the love