అబద్ధాల ప్రధానిది డంబాచారమే

The prime minister of lies Dambacharam– అసలు సినిమా ముందుందట..అదేంటో బీజేపీ చెప్పాలి…
– నిజానిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేపీ బందిఖానా నుంచి
– దేశాన్ని విముక్తి చేద్దాం బుక్‌లెట్‌ ఆవిష్కరణలో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పదేండ్ల మోడీ పాలన ముదనష్టంగా ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, టి జ్యోతి, డీజీ నర్సింహారావులతో కలిసి ‘బీజేపీ బందిఖానా నుండి దేశాన్ని విముక్తి చేద్దాం’ బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్శంగా మాట్లాడుతూ బీజేపీ నాయకులు, ప్రధాని మోడీ మళ్లీ మూడోసారి గెలవాలని తాపత్రయ పడుతున్నారని చెప్పారు. కానీ..వారి మాటలు, వారి చేతలు చూస్తే..తీవ్రమైన భయాందోళనలో ఉన్నట్టు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. అందుకే డంబాచారాలకు పోతూ, అబద్ధాలను వల్లె వేస్తూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో బీజేపీ బండారాన్ని బయట పెట్టేందుకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రకరకాల రూపాల్లో దాని అబద్ధాల ప్రచారాన్ని ఎండగట్టాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 సీట్లు గెలుస్తామని ఊదరగొట్టిన మోడీ.. ఇప్పుడా మాటలకు విరామమిచ్చారని గుర్తు చేశారు. ‘మంగళసూత్రాలు కూడా గుంజుకుంటుందని, ముస్లీంలకు రిజర్వేషన్లు తీసేస్తాం’ అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను సెంటిమెంటుతోపాటు మతోన్మాదాన్ని రెచ్చగొట్టటం ద్వారా గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. కానీ ఆ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో పదేండ్ల పాలన చూస్తే అర్థమవుతోందని వివరించారు. దేశంలో మోడీ హయాంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు. మొత్తం మీద 20 శాతం చదువుకున్న వారు నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేండ్లలో రూ. 7వేల కోట్లకు పైబడి ఆస్తి కలిగిన బిలియనీర్ల సంఖ్య 60 మంది నుంచి 220 మందికి ఎలా పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. పారిశ్రామి కీకరణ పూర్తిగా స్తబ్దతలోకి పోయిందన్నారు. అవినీతి బాగా పెరిగిందని చెప్పారు. ఎలక్టోరల్‌ బాండ్లలో సగం బీజేపీ దక్కించుకుందనీ, ఆ రకంగా ఇచ్చిన వారికి రాయితీలు ఇచ్చిందనీ, వారి అవినీతి ఈ దెబ్బతో మాఫీ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని పాతి పెట్టేందుకు అది శతవిధాలా ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇదంతా కేవలం ట్రైలరే..అసలు సినిమా ముందుందంటూ చెబుతున్నారని గుర్తు చేశారు. అసలు సినిమా అంటే ఏమిటి? మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తిరిగి రైతులపై బలవంతంగా రుద్దుతారా..? నాలుగు లేబర్‌ కోడ్‌లను రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా అమలు జరిపి, కార్మికులపై భారం మోపుతారా? గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను అణచేస్తారా? సీఏఏను అమలు జరిపి, మైనార్టీలకు పౌరసత్వం లేకుండా, ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తారా..? ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తారా? వన్‌నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ ద్వారా ఏకవ్యక్తి పరిపాలనను అమలు చేస్తారా? చెప్పాలంటూ నిలదీశారు. వీటి కోసమే అయితే.. అలాంటి సినిమా మనకొద్దనీ, ఆ సినిమాను వదిలించుకోవడం మంచిదని సూచించారు. లేకపోతే దేశానికి భవిష్యత్తే లేదని ఆయన హెచ్చరించారు.
అలాగే సీపీఐ (ఎం) చూపే ప్రత్యామ్నాయ విధానాలను కూడా ప్రజలకు వివరించాలని రాఘవులు ఈ సందర్భంగా కోరారు. బీసీలకు కుల గణన కావాలి, అది చేయాల్సిన అవసముందని అన్నారు. 50 శాతం రిజర్వేషన్‌ సిలింగ్‌ను ఎత్తివేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని కోరారు. మైనార్టీలకు, మహిళలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ఉపా’లాంటి చట్టాల్ని ఎత్తేయాల్సిన అవసరముందని చెప్పారు. ఇలాంటి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికతో సీపీఐ(ఎం) ప్రజల ముందుకు పోతోందని స్పష్టం చేశారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలనీ, కార్మికులకు కనీస వేతనాలిచ్చి వారి కొనుగోలు శక్తి పెంచాలన్నారు. లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వారిని, అలాంటి వాటి కోసం పనిచేసే వారిని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసర ముందని చెప్పారు. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించా లని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భువనగిరి పార్లమెం ట్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ పోటీ చేస్తు న్నారనీ, ఆయన్ను గెలిపించాలని కోరారు. ఆంధ్రప్ర దేశ్‌లో కొన్ని శాసన సభా, ఒక పార్లమెంట్‌ స్థానానికి సీపీఐ (ఎం) పోటీ చేస్తున్నదనీ, ఆయా స్థానాల్లో కూడా సీపీఐ(ఎం)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యావేత్త చుక్కా రామయ్యకు బీవీ రాఘవులు పరామర్శ
ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్యను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మంగళవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని విద్యా నగర్‌లో గల ఆయన నివాసానికి వెళ్లిన రాఘవులు..రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహ రావు కూడా ఉన్నారు.

Spread the love