మోడీ తెలంగాణకిచ్చింది గాడిదగుడ్డే

Modi gave Telangana a donkey– బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలే..ఆలోచన చేయాలే..
– సెమీఫైనల్‌లో కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాం
– ఫైనల్స్‌లో మోడీని గుజరాత్‌కు, బీజేపోళ్లను సూరత్‌కు పంపాలే..
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందానికి కేసీఆర్‌ వ్యాఖ్యలే నిదర్శనం
– ఇది గమనించే కాంగ్రెస్‌కు కమ్యూనిస్టుల మద్దతు : జమ్మికుంట, రేగొండ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– కరీంనగర్‌లో రాజేందర్‌రావును, వరంగల్‌లో కడియం కావ్యను గెలిపించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / జమ్మికుంట/భూపాలపల్లి
”పదేండ్లలో మోడీ తెలంగాణకు ఇచ్చింది గాడిదగుడ్డే.. బీజేపీ మళ్లీ గెలిస్తే దేశానికే ప్రమాదకరం.. రిజర్వేషన్లను ఎత్తేస్తారు.. 400 సీట్లలో గెలిపిస్తే రాజ్యాంగాన్నే మారుస్తామని చెబుతున్నారు.. సెమీ ఫైనల్లో కేసీఆర్‌ను ఓడించాం.. ఫైనల్లో గుజరాత్‌ గులాములను ఓడిస్తాం.. మోడీని గుజరాత్‌కు, బీజేపోళ్లను సూరత్‌కు పంపాలి.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి బప్పందం జరిగిందనేందుకు  ఇటీవల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.. బీఆర్‌ఎస్‌ ఎప్పటికైనా బీజేపీతో పోతుందని గమనించే బీజేపీని ఓడించేందుకు, దేశాన్ని రక్షించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు..” అని తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం కరీంనగర్‌, వరంగల్‌, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లోని జమ్మికుంట, రేగొండ, బాలాపూర్‌, బడంగ్‌పేట, ఆర్కేపురం, సరూర్‌నగర్‌ సభల్లో మాట్లాడారు.
”నన్ను అరెస్టు చేసిన కేసీఆర్‌ను ఓ మూలకు పండబెట్టా. కారును తూకం వేయాల్సిందే. కారు షెడ్డుకు పోయింది.. అందుకే కేసీఆర్‌ బస్సు యాత్ర చేస్తుండు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు బలహీన అభ్యర్థులను పెట్టుకున్నారు. బీజేపీ ఓడిపోతేనే ప్రజలు గెలుస్తారు’ అని అన్నారు. గుండు, అరగుండును గెలిపిస్తే.. ఏం చేశారని జమ్మికుంట సభలో రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. ఆలోచించి దేశం బాగు కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటునే పార్లమెంటులో అవమానించినా స్పందించని బండి సంజరుకి సిగ్గూశరం లేదని అన్నారు. కర్నాటకకు చెంబు, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, నీళ్లు ఇచ్చినట్టే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు.
హిందుత్వాన్ని వ్యాపార వస్తువు చేసిన మోడీ
కేంద్రంలో బీజేపీ తన రాజకీయం కోసం రాముడిని, హిందుత్వాన్ని వ్వాపార వస్తువుగా చేసి ఓట్లు అడుగుతోందని, హిందూధర్మాన్ని అవమానపరుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కల్యాణం కాకుండానే రాముడి తలంబ్రాల పేరుతో నెల రోజుల ముందే బీజేపీ వాళ్లు పసుపు కలిపిన బియ్యం ఇంటింటికీ పంచారని గుర్తు చేశారు. ఇది హిందూ సంప్రదాయాలను, శ్రీరాముడిని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. ఐదేండ్లు ఎంపీగా వెలగబెట్టిన కరీంనగర్‌, నిజామాబాద్‌ ఎంపీలు చేసింది ఏమీ లేక రాముడి ఫొటోతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. హిందుత్వాన్ని రాజకీయ వ్యాపార వస్తువుగా వాడుకుంటున్న మోడీని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం
తిక్కలోడు తిర్నాళ్లకు పోయినట్టుగా.. కేసీఆర్‌ బస్సు యాత్ర సాగుతోందని, కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని, బీజేపీకి 200 సీట్లు వస్తాయని నిన్న ఖమ్మంలో చెప్పిన ఆయన.. వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో నామ నాగేశ్వర్‌ను మంత్రిని చేస్తానని అన్నారన్నారు. ఆ మాటల్లోనే రాబోయే రోజుల్లో బీజేపీకి మద్దతు ఇస్తానని ఒప్పుకున్నారని, అందులో భాగంగానే రాష్ట్రంలో సగం సీట్లలో బీజేపీ గెలుపునకు సహకరిస్తూ కాంగ్రెస్‌ను ఓడించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో బీజేపీ పాలనను అంతం చేద్దాం
దేశంలో బీజేపీ పాలనను అంతం చేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ సభలో రేవంత్‌ రెడ్డి అన్నారు. భూములు మింగిన అనకొండ ఆరూరి రమేష్‌ను ఓడించి కడియం కావ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని, రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం 10 ఏండ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, అప్పుల కుప్పగా మార్చిందని, యువతను నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. అమిత్‌షాను కేసీఆర్‌ ఆవహించినట్టున్నారని, అందుకే గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులను పంపిస్తున్నారని అన్నారు. తనను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు వచ్చినా, సరిహద్దులో ఉన్న సైనికులు వచ్చినా భయపడేది లేదన్నారు. హామీల గురించే అడుగుతుంటే అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. పదేండ్లు ఏమీ చేయని కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు లేదని బడంగ్‌పేటలో అన్నారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కాలేడన్నారు. షెడ్డుకు పోయిన కారు ఇక రాదన్నారు.

Spread the love