అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి 

 – భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
 అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి, నిరావధిక సమ్మె విరమణకు కృషి చేయాలని అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జేఏసీ నాయకులతో చర్చలు జరపాలన్నారు. మండల కేంద్రంలోని హాస కొత్తూర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె  మంగళవారంతో 23వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యమున మాట్లాడుతూ  అంగన్వాడి ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడి ఉద్యోగుల సమ్మె పట్ల ప్రభుత్వం చూపుతున్న అలసత్వం మూలంగా అంగన్వాడి  కేంద్రాల్లో చిన్నారులకు గర్భిణులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీల సేవలు వెలకట్టలేనివని  గుర్తు చేశారు.దశాబ్దాలుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు  ఉద్యోగ భద్రత, పనికి తగ్గ వేతనం లేదన్నారు.అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు రూ. 26 వేల వేతనం అందించాలన్నారు. వివిధ జిల్లాల్లో నాయకులు, అంగన్వాడి ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.సమస్యల పరిష్కారం కోసం నిరావధిక సమ్మె  చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని బెదిరించడం సరైన విధానం కాదన్నారు.ఈ కార్యక్రమంలో  అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు మంజుల, అంగన్వాడీ టీచర్లు చిలువేరి  బాలమణి, మంజుల రాణి, మారుపాక పద్మ, పెదంబులు లావణ్య, మేకల అంజని దేవి, కత్తెరపాక శోభ, చింత సువర్ణ, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love