మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
నవతెలంగాణ-ఆలేరు టౌను
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగమైన, వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకిచ్చిన హామీని, వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు రెవిన్యూ డివిజన్ సాధన కొరకు చేపట్టిన బంధు విజయవంతమైందని, వారిని అభినందిస్తున్నానని చెప్పారు.
బంద్ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రెస్ మీట్ పెట్టారని, మాటలతో అందరిని మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అబద్దాలతో కూడినదిగా ఉందన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పూర్తి ప్రక్రియ తాను ఎమ్మెల్యేగా చేపట్టడం జరిగిందన్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు పూర్తయిన ప్రక్రియను వెంటనే అమలు చేయాలన్నారు. పది సంవత్సరాల క్రితం ఎం అభివృద్ధి చెందిందని అంటున్నారని, మేము చేసిన అభివృద్ధి ప్రస్తుతం ఉందని, మీరు పోటీపడుతూ అభివృద్ధి చేసి చూపించాలన్నారు.
ఆలేరు అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే చెబుతున్నారని, మున్సిపాలిటీ ఏర్పాటు చేసి, నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టింది తనేనని గొంగిడి సునీత చెప్పారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, కాలేశ్వరం ద్వారా రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మించి, నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించిన ఘనత తమదేమన్నారు.
ఆలేరు నియోజకవర్గంలోని మండలాలలోని గ్రామాలలో చెరువులు, కుంటలు, పూడికలు తీయించి రైతుల సాగు కొరకు నీరు నింపిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు, గడప, గడపకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చూసామన్నారు. రోడ్లు సిసి రోడ్లు కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా వేశామన్నారు.
420 హామీలు ప్రజలకు ఇచ్చారని, అమలు చేయలేదని, మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చని, చేతలలో అభివృద్ధి పనులు చేసి చూపెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడతారని విమర్శించారు. పని గడప దాటదాని, అబద్ధం మాత్రం అంగీ లాగేసుకుని ఊరంతా తిరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఆ విధంగా ఉందన్నారు. నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ప్రభుత్వ కళాశాలల నిర్మాణం తన హయాంలోనే జరిగిందన్నారు.
నేతన్నలకు చేనేత కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పట్టణ మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం గౌడ్, గంగుల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కుండే సంపత్, మున్సిపల్ కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, బీజన కళ్యాణి మధు, కొలనుపాక, టంగుటూరు సర్పంచులు, బేదరబోయిన యాకమ్మ , జూకంటి అనిల్, నాయకులు జల్లి నరసింహులు, రాంగోపాల్ రెడ్డి, పంతం కృష్ణ, బింగి రవి, మోతే వెంకటేష్ పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



