చార్‌ధామ్‌లో అసలు విషయం..

ఇహపరమైన”అపజయం అనాథ కాగా, విజయానికి తండ్రులు చాలా మంద”ని ఒక ఆంగ్ల సామెత! నవంబర్‌ 12 నుండి 28 వరకు పదిహేడు రోజులు కటిక చీకట్లో, అది పగలో రాత్రో తెలియకుండా కూలిన కొండల్లో, టన్నుల బండల మాటున మృత్యువుతో పోరాడి గెలిచారా కార్మికులు. తమతో పాటు ఆ కలుగులో ఇరు క్కున్న సోదర కార్మికుల్లో ఎందరు బతికున్నారో ఎందరు విగతజీవులుగా మిగి లారో తెలీదు వారికి. పొట్ట చేత పట్టుకుని బయల్దేరిన 8 రాష్ట్రాల వలస కార్మి కులు వారు. వారంతా సజీవంగా బయటికి రావడమొకెత్తయితే తేగలగడం మరొ క ఎత్తు. రకరకాల ప్రయత్నాలు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.
ఎన్నికల క్యాంపెయిన్‌లో నిమగమైయున్నా ఎప్పటికప్పుడు ప్రధాని తనకి ఫోన్‌ చేసి వాకబు చేస్తూనే ఉన్నారని ముఖ్యమంత్రి ధామి సెలవిచ్చారు. తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కార్మికులందరినీ రక్షించిన ఏజెన్సీలకు ధన్యవాదాలు చెప్పారు. యూపీకి చెందిన 8 మంది వలస కార్మికులు దాన్లో చిక్కుకున్నా, ఉత్తర ప్రదేశ్‌ సి.ఎమ్‌. గారికి బహుశా ఇతర ‘దైవ’ సంబంధ కార్యాలుండటం వల్ల, తమ పక్కనే ఉత్తరాఖండ్‌ ఉన్నా, హెలికాఫ్టర్లెక్కడం, ఫోన్‌లు చేసి వాకబు చేయడం వంటి ఇహపరమైన చర్యలు చేపట్టలేదు. మొదట పక్క నుండి, ఆ తర్వాత పై నుండి డ్రిల్లింగ్‌ చేపట్టినా మొత్తం తవ్వకం పూర్తిగాక నిషేధిత ర్యాట్‌ హోల్‌ డ్రిల్లింగ్‌ పద్ధతిలో మాన్యువల్‌ డ్రిల్లింగే ఉపయోగ పడింది. అమెరికా నుండి తెచ్చిన ఆగర్‌ డ్రిల్లింగ్‌ యంత్రం విరిగిపోవడంతో ఇతర పద్ధతులన్నీ ఉప యోగించారు. ఆస్ట్రేలియా నుండి భూగర్భ టన్నెల్స్‌ నిర్మాణంలో నిష్ణాతుల్ని పిలిపించారు. మొత్తం మీద ఈ కృషి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది కావచ్చు. ఆ మేర కు వాటిని అభినందించాల్సిందే. కాని కీలక విషయం తమ తోటి కార్మికుల్ని కాపాడుకునేందుకు కార్మికులు మొక్కవోని దీక్షతో అహోరాత్రులూ చేసిన శ్రమ! గట్టు మీదున్న వారు యోగా చేయ మన్నారు. ధ్యానం చేయమన్నారు. దీపావళి ముందు రోజు నవంబర్‌ 12న లోనికి పోయిన వారు 17 రోజుల నిరీక్షణ తర్వాత సజీవంగా బయటికి రావడంతో ఆ కార్మికుల కుటుంబాల్లో నిజమైన దీపావళి వచ్చింది.
వేడుకల మధ్య అసలు విషయాలను విస్మరించకూడదు. నిన్న ఈ 41మంది కార్మికుల్ని బయటికి తేవడంలో ఒక దాంతో ఒకటి సహకరించుకుంటూ పని చేసిన ఓఎన్‌జీసీ, సట్లెజ్‌ జల్‌ విద్యుత్‌ నిగమ్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌, నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరే షన్‌లకు నితిన్‌ గడ్కరీ ధన్య వాదాలు చెప్పారు. అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలు, సైన్యం అందరూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వారే.
అయితే ఈ నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీతో బీజేపీ నేతలకున్న బాదరాయణ సంబంధమేమిటో తెలియదు కానీ నాగపూర్‌ – ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం ఈ నవయుగా ఇంజ నీరింగ్‌ కంపెనీకే కట్టబెడ్తూ 2022లో మోడీ మొదటి దశ ప్రారంభోత్సవం చేశారు. ఉత్తర కాశీ టన్నెల్‌ కూలడానికి సరిగా 3 నెల్ల ముందు పెద్ద క్రేన్‌ సాయంతో పైకెత్తిన పెద్ద సిమెంట్‌ వయాడక్ట్‌ (దారి లాంటిది) పైన పడి 20 మంది కార్మికులు ఇంజనీర్లు చనిపోయారు. అయినా ఈ నవయుగా కంపెనీకే రిషీకేష్‌ – కర్న ప్రయాగ్‌ రైల్‌ మార్గ నిర్మాణం కూడా బంగారు పళ్ళెంలో పెట్టి అదే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అందించింది. డబుల్‌ ఇంజన్‌ సర్కారా, మజా కానా? ప్రస్తుతం ఏ.పి.లో చంద్రబాబు, జగన్‌ రెడ్డీల మధ్య దోబూచులాడుతోంది ఈ నవయుగా కంపెనీ.
నెల్లూరులోని క్రిష్ణపట్నం పోర్టు చంద్రబాబు కాలంలో నవయుగ చేతి లోకిపోగా 2020లో కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని కాంపిటీషన్‌ కమిషన్‌ మొదట 75శాతం వాటా అదానీకి కట్టబెట్టి 2021లో మిగిలిన 25 శాతం వాటాతో సహా మొత్తంపోర్టు అదానీ పరమయ్యేలా చేసింది. కొందరు రాజకీయ నాయకుల పెట్టుబడిదారులను పెరచడం, ఆ పెట్టుబడిదార్ల నిధులతో లేదా నల్లడబ్బుతో బీజేపీని పోషిస్తున్న తీరు గమనిస్తున్నార కదా! ‘కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి!” అన్నట్లుగానే రూ. 12 వేల కోట్ల చార్‌ధామ్‌ ప్రాజెక్టులో ఒక భారీ ముక్క సంపాదించింది ఈ నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ. దాన్లోదే ఈ టన్నెల్‌ నిర్మాణం.
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు ”ఈ ఘటన మాకు కనువిప్పు కల్గించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదు (2019లో ఇదే టన్నెల్‌లో మరో ప్రమాదం జరిగిన విషయం ఆయన ‘మర్చిపోయి’నట్లున్నాడు) ఈ టన్నెల్‌పై సేఫ్టీ ఆడిట్‌ జరిపిస్తాం. సాంకేతికతను మరింత వినియోగించడం నేర్చు కుంటాం.” కనీసం ప్రతి కి.మీ.కు ఒక ఎస్కేప్‌ రూట్‌ నిర్మించాలన్న దాన్ని ఈ నవయుగ కంపెనీ ఎందుకు అమలు చేయలేదో తేల్చమని అనేక మంది సైంటిస్టులు మొత్తుకుంటున్నారు. హిమాలయాల్లో ఇంత భారీ నిర్మాణాలు జరపరాదన్నా ఈ 900 కి.మీ. చార్‌ధామ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టడమే ఈ ప్రభుత్వం చేసిన తీవ్ర పొరబాటు. అన్ని రకాల పర్యావరణ ఆంక్షలను తోసిరాజని తలపెట్టిన చార్‌ధామ్‌ రోడ్డుతో భవిష్యత్‌లో మరిన్ని విలువైన మానవ జీవితాలు ప్రమాదంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పుణ్యక్షేత్రాల పేరున బీజేపీకి ఓట్లు రాలొచ్చేమోగాని పర్యావరణం నాశనమై, మానవ జీవితాలు ప్రమాదంలో పడ్తాయి.
ఒక రోడ్‌ నిర్మాణమో, టన్నెల్‌ నిర్మాణమో జరిగేటపుడు, ముఖ్యంగా మానవ విషాదాల గురించి ఆలోచించేటపుడు ప్రభుత్వ రంగ ప్రాధాన్యత, ప్రయివేటు రంగ దుర్మార్గాలు ఈ సందర్భంగా గమనించడం అవసరం.

Spread the love