నువ్వు విధ్వంసం ఎంత కాలమౌతావు
నీ మనసు విస్పోటనమైతేగాని
నువ్వు మళ్ళీ మనిషిగా నిలదొక్కుకోలేవు
బతుకు ప్రశ్నార్థకమైన చోట ఎంతకాలం నిల్చుంటావు?
మౌనం రేపటి ప్రశ్నలకు
జవాబు పత్రం కావచ్చు
అన్న నాన్న మాటలు
పూలమ్మిన చోట
కట్టెలమ్మలేక వలసెల్లినప్పుడు
ఆకలి మింగిన జాడలు దాటడానికి
బతుకు జీవుడా అంటూ
జీవన సముద్రాన్ని ఈదుతూ
ఎన్ని కన్నీటి అలలను
దాటుకుని వచ్చామో కదా
వెర్రిగా పరుగులు పెడుతూ
ఎంత దూరం వెళ్ళామో తెలియదు గాని
తడబడిన కాళ్ళు మేం అలసిపోయాము మోర్రో అని చెప్పేవరకు తెలియలేదు
మన మజిలీ ఇక్కడితో …
ఆగిపోతుందా అన్న భయం
వెంటాడుతుంది నాకు
పడగవిప్పిన కాలం బుసలు కొడుతూ
రాహువు మింగిన చంద్రుడిలా
నిత్యం కాటేసినప్పుడల్లా మన జీవనచక్రం
మళ్ళీ మొదటికి వస్తుందని
ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది సోదరా
మనం ఎడారిలో వున్నామో…
పచ్చిక మైదానంలోనే వున్నామో
తెలియడం లేదు ఎందుకంటే
నువ్వు నేను వేసే పాత్రలన్నీ
ఈ మాయ జగనాటకంలో
భాగమని తెలుసినా
మనసెప్పుడు నిశ్చలంగా ఉండదు కదా
ఆర్ధిక స్థిరత్వం కోసం …
రేపటి భవిష్యత్తుకు నిచ్చనలేసుకున్నప్పుడల్లా
తెగువున్న ప్రతీవాడు యుద్ధం చేస్తాడు
గెలుపే కొందరి ఖాతాలో
జమ అవుతుంది బిడ్డా
అని చెప్పే అమ్మ ఆశీర్వచనాలు
మనసులో దాచుకుని ఇక్కడి వరకైతే వచ్చాం
మనం గెలిచామో ఓడామో
రేపటి కాలం నిర్ణయిస్తుందని
సీతకోక చిలుక ఒకటి సందేశమైతే తెచ్చింది
ప్రాణాలు అనంతంలో కలసిన
దేహం మట్టిలో కరిగిన
ఈ పూలు చెట్లు గుట్టలు పక్షులు..
ప్రకతి ఉన్నంత వరకు వాటి ఊపిరిలో ఊపిరై మనమైతే ఇక్కడే వుందాం
– వజ్జీరు ప్రదీప్, 9989562991
కాల సర్పం..!
- Advertisement -
- Advertisement -



