న్యాయసేవ సంస్థ సేవలు చిరస్మరణీయం

– తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ శ్రీసుధ,జస్టిస్ తుకరాంజీ
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కు ప్రశంస పత్రం అందజేసి మరిన్ని సామాజిక కార్యక్రమాలకు చేయూత నిస్తామని వెల్లడి
నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయవిజ్ఞాన సదస్సులు,సామాజిక చైతన్య కార్యక్రమాలకు చేయూతను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ,తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ సామ్ కోషి ,హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ తుకారాంజీ తెలిపారు.  హైదరాబాద్ లోని జస్టిస్ సామ్ కోషి నివాసంలో సహచర హైకోర్టు న్యాయమూర్థులు జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ తుకారాంజీ లతో కలిసి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల కు ప్రశంసపత్రం అందజేశారు. బాలికల, మహిళల ఆత్మరక్షణలో భాగంగా తైక్వాండో తో పాటు,ఇతర ఆత్మరక్షణ పద్దతులను సామాజిక స్ఫూర్తిగల వ్యక్తులు, వర్గాలతో కలిసి నేర్పించడం చిరస్మరణీయంగా నిలిచి ఉంటాయని అన్నారు. నిజామాబాద్ లో మార్చి 3న 11 వేల మంది బాలికలు,మహిళలతో తైక్వాండోలాంటి ప్రదర్శనను ప్రదర్శించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లో చోటు సంపాదించుకోవడం  న్యాయసేవ సంస్థ చరిత్రలోనే ప్రముఖఘట్టంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.న్యాయసేవల ప్రాధికార చట్టం న్యాయమూర్తులను న్యాయార్థుల సేవలకై  వారి దరికి దగ్గర చేస్తున్నదని వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆదర్శవంతమైన,ప్రగతిశీలక,స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తామని వారు తెలిపారు. ప్రశంసపత్రం అందజేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సంస్థ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్,సంస్థ సిబ్బంది సుమలత, భరత్, లక్ష్మణ్,నాగేందర్ పాల్గొన్నారు.
Spread the love