పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం పరిస్థితి

పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం పరిస్థితి– జిల్లాలను తొలగిస్తే ప్రజా ఉద్యమం
– బతుకమ్మ చీరలతో నేతన్నలకు బతుకునిచ్చింది కేసీఆర్‌
– బకాయిలు చెల్లించి, ఉపాధి కల్పించాలి
– 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించండి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌/ కుత్బుల్లాపూర్‌
రాష్ట్రం పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందనిపిస్తోందని, ప్రభుత్వం జిల్లాలను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. 33 జిల్లాలను యథావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. శనివారం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాగే, బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌నగర్‌లో రోడ్డుషోలో కేటీఆర్‌ ప్రసంగించారు. ప్రజలు పోరాటాలతో సాధించుకున్న జిల్లాల్లో సిరిసిల్ల ఒకటన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జిల్లాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుందని, ఏ జిల్లాలను తొలగిస్తారు తేటతెల్లం చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో నాలుగు మంచి మాటలు, స్వాంతన చేకూర్చే మాటలు చెబుతారని, ప్రజలు, ఇక్కడి ఎమ్మెల్యేగా తాను ఆశించానని కానీ సీఎం చిల్లర మాటలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. సిరిసిల్లలో బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. బకాయిలు చెల్లించక, ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కు లేదన్నారు. మే 13న ప్రజలు వీటిపై తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, లీగల్‌సెల్‌ నాయకుడు ఆవునూరి రమాకాంత్‌రావు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌ రోడ్డు షో..
లోక్‌సభ ఎన్నికలలో 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా తెలంగాణ రాజకీయాలను కేసీఆర్‌ శాసిస్తారని కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌నగర్‌ రోడ్డుషోలో కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. బడే భారు మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అదే మాదిరి 2023లో చోటా భారు రేవంత్‌రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభిపూర్‌ రాజు కుత్బుల్లాపూర్‌కు జోడెద్దుల్లా మంచిగా కలిసి పనిచేస్తున్నారని అభినందించారు. మూడో శక్తి రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపిస్తే కుత్బుల్లాపూర్‌లో ఏ సమస్య లేకుండా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభిపూర్‌ రాజు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love