గర్భస్రావం కేసు : గుజరాత్‌ హైకోర్టుకి మొట్టికాయలేసిన సుప్రీంకోర్టు

నవతెలంగాణ -న్యూఢిల్లీ :   గర్భస్రావం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గుజరాత్‌ హైకోర్టుకి మొట్టికాయలేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదైనా కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ”గుజరాత్‌ హైకోర్టులో ఏం జరుగుతోంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా భారతదేశంలోని ఏ కోర్టూ కూడా ఆదేశాలు జారీ చేయకూడదు. ఇది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం” అని జస్టీస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన ద్విసభ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజా పరీక్ష తర్వాత..  గర్భస్రావానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఒకవేళ నిర్వహించాల్సిన వైద్య ప్రక్రియ తర్వాత, పిండం సజీవంగా ఉన్నట్లు తేలితే.. పిండం బతికేలా చూసేందుకు ఆస్పత్రిలో… ఇంక్యుబిలేటర్‌ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాత చట్ట ప్రకారం.. బిడ్డను దత్తత తీసుకునేలా రాష్ట్రం చర్యలు చేపట్టాలి” అని ధర్మాసనం ఆదేశించింది.”క్లరికల్‌ ఎర్రర్‌”ను సరిచేసేందుకే శనివారం ఆదేశాలు జారీ చేశామని గుజరాత్‌ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. ”గతంలో ఇచ్చిన ఆదేశాలను టైప్‌ చేసే సమయంలో తప్పు దొర్లిందని (క్లరికల్‌ ఎర్రర్‌), శనివారం ఆ తప్పుని పరిష్కరించారు ” అని  సమర్థించుకునేందుకు యత్నించారు. ”ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంగా మేము న్యాయమూర్తిని అభ్యర్థిస్తాము” అని అన్నారు. అత్యాచార బాధితురాలి (25)  గర్భస్రావ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే విషయంలో గుజరాత్‌ హైకోర్టు తీవ్ర జాప్యం చేసిందని శనివారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ హైకోర్టు విలువైన సమయాన్ని వృధా చేసిందని, ఉదాసీన వైఖరితో వ్యవహరించిందని ధ్వజమెత్తింది. ఈ పిటిషన్‌ విచారణను సోమవారానికి జాబితా చేసింది.

Spread the love