పట్టణ ప్రజల దాహార్తి కేకలు

– నడి ఎండలో నీటి కోసం పాట్లు
– అధికారులు పట్టించుకోవడం లేదంటూ  ఆరోపణలు
– సమస్యను పరిష్కరించాలని వేడుకోలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణంలో పలు వార్డులలో నీటి సమస్యలు తీవ్రమయ్యాయి. పట్టణంలోని 11వ వార్డు అర్బన్ కాలనీ,కతాల్ గూడ లో తాగునీటి కష్టాలు అధికంగా కనిపిస్తున్నాయి. చుక్క నీటి కోసం రోజంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి. గత రెండు నెలలుగా కాలనీవాసులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.  నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. అర్బన్ కాలనీలో సుమారు 1000 మంది జనాభా ఉంటుంది. అక్కడ కాలనీవాసుల నీటి సౌకర్యార్థం ఆరు బోర్లు ఉండేవి. భూగర్భ జలాలు అడుగంటి  అందులో కొన్ని బోర్లు  ఎండిపోయాయి. మరికొన్ని నీరు రావడం తగ్గాయి. అవే కాకుండా గత ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వేయించిన బోరు కూడా భూగర్భ జలాలు తగ్గడంతో నీరు రావడం తగ్గింది. దీంతో కాలనీలో నీటి సమస్య తీవ్రతరమైంది. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. సాధారణ రోజులలో పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక పండగలు వచ్చినప్పుడు మా  బాధ ఎవరికి చెప్పుకోవాలంటు  ఆవేదన చెందుతున్నారు. నీటి ట్యాంకర్లు రావడంలేదని, నాలుగు రోజులకు ఒకసారి అది కూడా కాసేపు మాత్రమే నీటిని వదులుతున్నారని ఆరోపిస్తున్నారు. నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నీరు దేనికి సరిపోవటం లేదని  ఆవేదన చెందుతున్నారు. సోమవారం నీటి ట్యాంకర్ కోసం  కాలనీవాసులో ఖాళీ బిందెలతో  ఎర్రటి ఎండని కూడా లెక్క చేయకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూశారు. అయినా ట్యాంకర్ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ కాలనీ ప్రజలను ఏ ప్రజా ప్రతినిధి పట్టించుకోవడంలేదని, మున్సిపల్ అధికారులైతే కనీసం  లెక్కచేయడం లేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. జిల్లా కేంద్రంలో అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడే సమస్య ఇలా ఉంటే వచ్చే రెండు నెలల్లో పరిస్థితి ఏంటని   ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారుల స్పందించి కాలనీలో బోర్లు వేయించాలని, నీటిని రోజు తప్పి రోజు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మరొక  విశేషమేంటంటే అర్బన్ కాలనీలో పరిస్థితి ఇలా ఉంటే వినాయక హౌసింగ్ బోర్డ్ కాలనీలో ని ప్రజలకు ఇప్పటివరకు సాగర్ జలాలు సరఫరా కాకపోవడం గమనార్హం.
రోజువిడిచిన రోజు మంచినీరు ఇవ్వాలి: దండెంపల్లి సరోజ
అర్బన్ కాలనీలో మంచినీటి కోసం గత రెండు నెలలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. భూగర్భ జలాలు తగ్గి బోర్లు నుండి  నీరు రాకపోవడం ఒక సమస్య అయితే సరఫరా చేసే విధానంలో కార్మికుల లోపం కూడా కొంత ఉంది. మున్సిపల్ ట్యాంకర్లు వచ్చినా, నీరు అసలే రాని ప్రాంతాలకు కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి నీటి  సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
Spread the love