ట్రాక్‌ పునరుద్ధరించాం : ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హౌరా-సికింద్రాబాద్‌ (ట్రైన్‌ నెంబర్‌ 12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు డివిజన్‌లోని బోమ్మాయిపల్లి-పగిడిపల్లి సెక్షన్‌ మధ్య బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. ఎస్‌-2 నుంచి ఎస్‌-6 వరకు ఐదు బోగీలు ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యాయని పేర్కొన్నారు. పొగలు రావడంతో రైల్లోని సిబ్బంది అలారం చైన్‌ లాగి రైలును నిలుపుదల చేసి, ప్రయాణీకుల్ని అప్రమత్తంచేసి, దించేశారని వివరించారు. తాను కూడా వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దగ్గర ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించినట్టు తెలిపారు. యాక్సిడెంట్‌, మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్లు తక్షణం ఘటనా స్థలానికి చేరుకున్నాయనీ, దీనివల్ల పలురైళ్లను దారిమళ్ళించాల్సి వచ్చిందన్నారు. సాయంత్రం 6 గంటలకల్లా రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించి, రాకపోకలు మొదలయ్యాయని తెలిపారు. ఫలక్‌నుమా ప్రయాణీకుతో పాటు ఆలస్యమైన ఇతర రైళ్లలోని ప్రయాణీకులకు కూడా స్నాక్స్‌, వాటర్‌బాటిళ్లు అందించామని, ప్రత్యేక బస్సులు, రైళ్లలో వారిని సికింద్రాబాద్‌, గుంటూరుకు తరలించామన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన కోచ్‌లను తొలగించి, మిగిలిన బోగీలతో ఫలక్‌నుమా రైలును సికింద్రాబాద్‌కు తెచ్చామని వివరించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక విచారణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Spread the love