సింగరేణి లాభాలు రూ.2,222 కోట్లు

– గతేడాదికంటే 81 శాతం వృద్ధి
– సీఎమ్‌డీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో లాభాల్ని నమోదు చేసిందని ఆ సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ శ్రీధర్‌ తెలిపారు. గత ఏడాదితో పోల్చిచూస్తే 81 శాతం వృద్ధితో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించామన్నారు. కోల్‌ ఇండియాతో సహా మహారత్న కంపెనీలన్నింటిికన్నా లాభాల్లో గణనీయమైన వృద్ధి లభించిందన్నారు. ఆదాయంలో సింగరేణి తొలి స్థానంలో ఉంటే, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ రెండోస్థానం, కోల్‌ ఇండియా నాల్గవ స్థానంలో ఉన్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.33,065 కోట్ల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించిందన్నారు. శుక్రవారంనాడాయన ఈ వివరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ అధికోత్పత్తి, టర్నోవర్‌, లాభాలు సాధించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్‌ నాయకులకు అభినందనలు తెలిపారు. విభాగాల వారీగా ఎంతెంత లాభాలు ఆర్జించాయో ఆయన గణాంకాలతో సహా వివరించారు. ”2022 -23 లో బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఇతర ట్యాక్స్‌ల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సింగరేణి చరిత్రలోనే ఇది ఒక ఆల్‌ టైం రికార్డ్‌. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021 -22 లో సింగరేణి సాధించిన నికర లాభాలు రూ.1,227 తో పోలిస్తే లాభాలు 81 శాతం అధికం. టర్నోవర్‌ కూడా 2021- 22లో సాధించిన రూ.26,585 కోట్లపై గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో సాధించిన రూ.33,065 టర్నోవర్‌ 24 శాతం అధికం” అని వివరించారు. బొగ్గు అమ్మకం ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్‌ అమ్మకం ద్వారా రూ. 4,415 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

Spread the love