వడ్డెరవృత్తిదారులకు రుణాలివ్వాలి

–  వడ్డెర వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వడ్డెరవృత్తిదారులకు రుణాలివ్వాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఇడగొట్టి సాయిలు, పల్లపు.విఘ్నేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర వృత్తిదారుల బతుకులు నేటికీ బాగుపడలేదని పేర్కొన్నారు. పాలకులు వడ్డెర్ల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారనీ, సమాజానికి దూరంగా బతుకుతున్నారని తెలిపారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అని ప్రశ్నించారు. వారి అభివద్ధికి కేవలం మూడు కోట్ల రూపాయలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 4వేల సొసైటీలున్నప్పటికి వాటి ద్వారా ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డెర వృత్తిదారులు చనిపోతే కనీసం ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించడం లేదని తెలిపారు. అత్యంత వెనుకబడిన వృత్తిదారులకు వడ్డెర బంధును ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇండ్లు లేని వారికి డబుల్‌ బెడ్‌ రూము ఇండ్లని ఇవ్వాలని కోరారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇవ్వాలనీ, వడ్డెర వృత్తిదారులకు ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో దండుగుల నరసింహులు, దండుగుల బాలయ్య, ఇ. కురుమయ్య, దండుగుల జంగయ్య, ఈడగొట్టి చిన్నఓడ్డన్న, తదితరులు పాల్గొన్నారు.

Spread the love