– పాత పద్ధతిలోనే రైతులకు పంపిణీ జరగాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేరుగు సత్యనారాయణ
– గంగారం సొసైటీ కార్యాలయం వద్ద ధర్నా, రైతులతో సంతకాల సేకరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యూరియా యాప్‌ను రద్దుచేసి పాత పద్ధతిలోనే రైతులకు యూరియా పంపిణీ జరగాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేరుగు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గంగారం సొసైటీ కార్యాలయం వద్ద మంగళవారం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులతో సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ మాట్లాడుతూ… రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, యూరియా పంపిణీలో ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం యూరియా కోసం అమలు చేస్తున్న యూరియా యాప్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యాప్‌లో నమోదు, సాంకేతిక సమస్యలు, సర్వర్ సమస్యలు తదితర కారణాలతో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న రైతులు రైతులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగానే పాత పద్ధతిలో రైతులకు అవసరమైనంత మేరకు యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు న్యాయమైన ధరకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలన్నారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా కొరతను నివారించాలని, యూరియా యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, పార్టీ మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, గుంట్రూ జయరాజు, పటాన్ తానీషా, బెజవాడ లక్ష్మీనారాయణ, బండారు వెంకటేశ్వరరావు, యామాల బ్రహ్మారావు, గుండి సింగరాజు, వసంతరావు, ఈర్ల శ్రీను, చీపు సత్యనారాయణ, పాకనాటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.



