ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..

Screen for campaign.. Lure for temptation..– నేటితో ముగియనున్న పార్టీల క్యాంపెయిన్‌
– మూగబోనున్న మైకులు
– మొదలుకానున్న ప్రలోభాలు
– రాష్ట్రాన్ని చుట్టేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ
– భువనగిరిలో తనదైన శైలిలో సీపీఐ (ఎం) ప్రచారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో మండుటెండల్లో కొనసాగిన రాజకీయ పార్టీల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడనుంది. దీంతో ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి గత 20 రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఇక ఓటర్లకు తాయిలాలు, ప్రలోభాల ప్రహసనం షురూ కానుంది. ఇంటింటి ప్రచారం పేరిట ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ధనిక పార్టీలన్నీ… తమ తమ ‘సాధనాలను’ సిద్ధం చేసుకున్నాయి. విచ్ఛలవిడిగా డబ్బు, మద్యాన్ని పంపిణీ చేసేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు రెండు రోజులపాటు మద్యం షాపులు మూతపడనున్న నేపథ్యంలో ఇప్పటికే తగినంత స్టాక్‌ను పార్టీల నేతలు నిల్వ చేసుకున్నట్టు సమాచారం. ప్రచారం పరిసమాప్తమైన తర్వాతి రోజైన ఆదివారం ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదనీ, న్యూస్‌ ఛానళ్లలో మాట్లాడకూడదనీ, ప్రకటనలు జారీ చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ మరుసటి రోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది.
ఎన్నికల ప్రచారంతో ఇన్ని రోజులపాటు రాష్ట్రం హోరెత్తింది. క్యాంపెయిన్‌ నిమిత్తం బీజేపీ తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక తెలంగాణలో పర్యటించారు. ఇక సీఎం రేవంత్‌… కాంగ్రెస్‌కు అన్నీ తానై ప్రచారాన్ని ముందుండి నడిపించారు. బీఆర్‌ఎస్‌ తరపున ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. సీపీఐ (ఎం) తాను పోటీ చేస్తున్న భువనగిరిలో కేంద్ర ప్రభుత్వ విధానాలను, బీజేపీ మతోన్మాద చర్యలను ప్రజలకు విడమరిచి చెప్పింది. కాషాయ పార్టీ మూడోసారి అధికారంలోకొస్తే దేశానికి రాబోయే పెను ప్రమాదాలను వివరిస్తూ ముందుకు సాగింది. పేదల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే బీజేపీని ఓడించటమొక్కటే మార్గమని సూచించింది. అందువల్ల కమలం పార్టీని ఓడించాలంటూ సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌… బూర్జువా పార్టీలకు భిన్నంగా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
రాష్ట్రాన్ని చుట్టేసిన రేవంత్‌…
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు దీటుగా ప్రచార సభలు నిర్వహించారు. పార్టీ ప్రచారాన్ని మొత్తం తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో జరిగిన జనజాతర సభతో తన ఎన్నికల క్యాంపెయిన్‌ను మొదలు పెట్టి, మొత్తం 27 రోజుల్లో 57 సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలతో ఆయన ప్రచారాన్ని హోరెత్తించారు. కొన్నిసార్లు రోజుకు నాలుగైదు సభలకు హాజరయ్యారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశించటంతో కర్నాటక, కేరళలో సైతం ఆయన క్యాంపెయిన్‌ నిర్వహించారు. అక్కడి బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీ నామినేషన్‌ కార్యక్రమానికి సైతం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో సైతం కాంగ్రెస్‌కు ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రేవంత్‌ ప్రచారాన్ని పదునెక్కించారు. బీజేపీ మూడోసారి అధికారంలో కొస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమ య్యాయి. దీనిపై మోడీ, అమిత్‌ షా సైతం వివరణలు ఇవ్వాల్సి వచ్చింది.
బాస్‌ యాత్రతో బీఆర్‌ఎస్‌లో జోష్‌…
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ బీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర… మాంచి ఊపునిచ్చింది. ఏప్రిల్‌ 24 నుంచి శుక్రవారం వరకూ మొత్తం 17 రోజులపాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాలుగు నెలల పాలనలో కరెంట్‌, నీటి కష్టాలు మొదలయ్యాయంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నించారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా పలు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్‌ నిర్వహించి, క్యాడర్‌లో జోష్‌ నింపారు.
మరోసారి మతవాదమే…
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలిచేందుకు పావులు కదుపుతున్న బీజేపీ… అందుకనుగుణంగా మరోసారి హిందూవాదాన్ని ఎత్తుకుంది. ఆ వాదాన్ని ఎక్కించేందుకు ఆ పార్టీ జాతీయ నేతలు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో కలియదిరిగారు. వీరిలో మోడీ అయితే తెలంగాణలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. ఆయన దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించారు.

Spread the love