తెలుగు వారికందరికీ మొట్టమొదటి పండుగ ఉగాది. ఎంత ఆంగ్ల సంవత్సరపు మొదటిరోజున హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నా ఉగాదితోనే మన సంవత్సరం మొదలవుతుంది. కొత్త బట్టలు, పిండి వంటలు ప్రతి పండుగకి ఉన్నా, ఉగాది అంటే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, మామిడికాయలు, పంచాంగ శ్రవణాలు… ఇంకా మరెన్నో!
చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. పురాణాలలో కథ ప్రకారం సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది అమలులోకి వచ్చిందని చెబుతారు.
మనకు ఉన్న ఆరు ఋతువులలో మొదటి ఋతువు అయిన వసంత ఋతువు కూడా చైత్రమాసం శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ప్రకతి చాలా అందంగా ఉంటుంది. అందువల్ల నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది అంటే కొత్త శకం.
ఉగాది అనే పదంలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. జన్మ ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటి రోజు. అందువల్ల ఉగాది అంటారు. మరో అర్థంలో యుగం అంటే రెండు లేక జంట అంటే ఉత్తరాయణం, దక్షణాయమని అనబడే ద్వయం సంయుతం. యుగాదికి ఆది కనుక ఉగాది అంటారు. దీనిని సంవత్సరాదిగా కూడా మనం భావిస్తాం.
చరిత్రలో ఉన్న మరో కథనం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున శాలివాహన చక్రవర్తి పట్టాభిశక్తుడై శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగ కర్తగా భాసిల్లాడు. అతని స్మతితో ఉగాది ఆచరింపబడుతుంది.
ఉగాది పండుగను తెలుగువారు జరుపుకుంటే, ఇదే రోజును మరాఠీ వారు ‘గుడి పడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖి’ గాను, బెంగాలీలు ‘పోయి లా బైసాక్’గా జరుపుకుంటారు.
ఏ భాష ఏ ప్రాంతం వారు ఎలా జరుపుకున్నా తెలుగు వారు మాత్రం ఖచ్చితంగా చేసుకునేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. గమ్మత్తు ఏమిటంటే ప్రపంచంలో ఏ పచ్చళ్లకు లేని ప్రత్యేకత ఈ ఉగాది పచ్చడికి ఉంది!
సంవత్సరంలో ఋతువులు ఆరు , అలాగే ఉగాది పచ్చడిలో రుచులు ఆరు ఉంటాయి. ఉగాది పచ్చడి చేసే విధానం… ఒక శుభ్రమైన పాత్రలో తీయదనం కలిగించేందుకు బెల్లం వాడతారు. ఉప్పుని జీవితంలో రుచికి ఉత్సాహం కలిగించడం గుర్తుగా ఉపయోగిస్తారు. చేదు కోసం వేప పువ్వు శుభ్రం చేసుకొని రేఖల్ని పాత్రలో వేస్తారు. చేదు బాధ కలిగించే అనుభవాలకి సంకేతం. పులుపు కోసం చింతపండు కొంచెం నానబెట్టి గుజ్జు తీసి పాత్రలో కలుపుతారు. జీవితంలో నేర్పరితనంగా ఉండడానికి ఈ పులుపు చిహ్నం. వగరు కోసం పచ్చి మామిడికాయ ముక్కలను లోపల ఉండే లేత జీడి తీసేసి చిన్న ముక్కలుగా కానీ తురిమి కానీ వేసుకుంటారు. మామిడికాయ లేతదనంలో కాస్త వగరుగా ఉంటుంది. ఇది మన జీవితంలో ఎదుర్కొనే కొత్త సవాళ్లకు ప్రతీక. కొంచెం కారం వేస్తేనే పచ్చడి సంపూర్ణమవుతుంది. సహనం కోల్పోయే పరిస్థితులకు సూచిక కారం.
ఇవన్నీ రంగరించి కలుపుకొని ఉగాది పచ్చడిగా సేవిస్తారు. అయితే ఇవి ప్రధానంగా వేసి, ఎవరెవరి రుచి ఇష్టం ప్రకారం ఆ పచ్చడిలో అదనంగా నచ్చినవి ముక్కలు గాను, తురిమి గాని కలుపుకుంటారు. అంతా కలిపి ఒక గిన్నెలో దేవుడికి సమర్పించి ఆ తర్వాత ఉగాది పచ్చడిని సేవిస్తారు. చలికాలం నుంచి వేసవి కాలంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఉగాది పచ్చడి రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని ప్రజల విశ్వాసం.
మన పెద్దవారు చెప్పే దాని ప్రకారం ఉగాది రోజున వేప పువ్వు వేసిన ఉగాది పచ్చడి సేవించి, పంచాంగ శ్రవణం చేయాలి. మిత్రులను కలుసుకోవాలి. పెద్దలను పూజించాలి, గోపూజ చేయాలి. ఏరువాక అనే ఆచారం కూడా పాటిస్తారు.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయి? ఏ యే రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది… అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే కాకుండా, పంచాంగ శ్రవణం ద్వారా దేవుని అనుగ్రహం కూడా కలుగుతుందని ప్రజల విశ్వాసం!
ఉగాది రోజున కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. కవులందరూ ఒకచోట సమావేశమై, ఉగాది పండుగ గురించి, సమకాలిన అంశాలను గురించి తమ తమ కవితలను వినిపిస్తారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహించి కవులను సత్కరిస్తుంది. ఆకాశవాణి దూరదర్శన్లు వీటిని ప్రసారం చేస్తాయి. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, దేశీయంగా అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వారందరూ ఆనందంగా కవి సమ్మేళనాలు జరుపుకుంటారు. ఉగాది సందర్భంగా సాహితీ పురస్కారాలను కూడా అందజేస్తారు.
మనకున్న 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం పేరు ప్రకారం ఆ సంవత్సరాన్ని ఆ పేరుతో పిలుచుకుంటాం. క్రోధి నామ సంవత్సరం పూర్తి చేసుకొని ఈ ఉగాదితో మనం ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ‘విశ్వావసు’ అంటే ప్రపంచానికి సంబంధించిన వాడు లేదా ప్రపంచం యొక్క సంపదలు కలిగిన వాడు అని అర్థం.
కొమ్మపై కోయిల కమ్మగా పాడుతున్నట్లుగా ఉగాదిపై కోయిలపై అనేక రకాల లలిత గీతాలు, సినీ గీతాలు, భక్తి గీతాలు రచించబడి, పాడి ఉన్నాయి. ఉగాది పండుగ రోజున దేవాలయాలను సందర్శిస్తారు. ఉగాది పచ్చడితోపాటు పులిహోర, బొబ్బట్లు మరికొన్ని ఎవరి ఇష్టానుసారం వారు రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. తలకి స్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, పంచాంగం వినడం, వింటూ వింటూ ఆదాయ వ్యయాలను చూసి నాకన్నా నీకు ఎక్కువ.. నాకు తక్కువ ఆదాయం అంటూ అంచనాలు వేసుకోవడం సరదాగా జరిగిపోతుంది.
ఆనందాలన్నీ మూటగట్టుకొని మామిడాకుల తోరణాల గడపను దాటుకొని కొత్త సంవత్సరంలోకి కొంగొత్తగా అడుగుపెట్టిన విశ్వాసుని ఆహ్వానించి ఈ సంవత్సరం అంతా ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుందాం. కొందరు ఈ సంవత్సరం ఏమేం చేయాలో ప్రణాళికలు వేసుకుంటారు. మరికొందరు తమని అంటిపెట్టుకొని ఉన్న పాత అలవాట్లు ఇకపై మానేయాలనే ఆశాభావంతో సంసిద్ధమవుతారు.
శుభాలను కలిగించమని కోరుకుంటూ విశ్వావసు సంవత్సరానికి మనమంతా కలిసికట్టుగా ఆహ్వానం పలుకుదాం. మావిచిగురులతో కోయిల పాటలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుదాం!
డా. సమ్మెట విజయ
9989820215