ఎస్సీ, ఎస్టీల కోటా కొనసాగింపు అవసరమే

– సుప్రీంకు కేంద్రం నివేదన
న్యూఢిల్లీ : చట్టసభలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్లను విధిగా కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజ్యాంగంలోని 104వ సవరణ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించనున్న ధర్మాసనం ఎదుట సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ వ్యాఖ్య చేశారు. 2019లో చేసిన ఈ సవరణ చట్టం ద్వారా చట్టసభలలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పది సంవత్సరాలు పొడిగించారు. దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్లపై నవంబర్‌ 21న విచారణ ప్రారంభమవుతుంది.
ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో-ఇండియన్లకు తొలుత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 334 కింద రిజర్వేషన్లు కల్పించారు. పది సంవత్సరాల తర్వాత అంటే 1960లో ఆ కోటా కాలపరిమితి ముగియాల్సి ఉంది. అయితే అప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లను పెంచుతూ రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు. 104వ సవరణ చట్టం 2019లో ఆమోదం పొందింది. అయితే అప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పది సంవత్సరాలు పొడిగించి నప్పటికీ ఆంగ్లో-ఇండియన్ల రిజర్వేషన్లను పొడిగించలేదు. కాగా 2019లో ఇచ్చిన పొడిగింపును మాత్రమే పరిశీలిస్తానని, అంతకుముందు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకోబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Spread the love