ఇవ్వడంలో ఆనందముంది

There is joy in giving13 ఏండ్ల వయసులోనే టైప్‌ 1 డయాబెటిస్‌తో బాధపడే పిల్లల కోసం ‘ప్రాజెక్ట్‌ సూర్య’ను స్థాపించింది. దీని ఆధ్వర్యంలో వేల మంది పిల్లలకు డయాబెటిస్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఆమె చేసిన ఈ కృషికి అంతర్జాతీయ ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఆమే కర్ణాటకాకు చెందిన దివా ఉత్కర్ష. అంత చిన్న వయసులో ఇంత పెద్ద ఆశయాన్ని భుజానికెత్తుకోవల్సిన అవసరం ఆమెకు ఎందుకు వచ్చిందో… ఆ ప్రాజెక్ట్‌ విశేషాలేంటో ఆమె ద్వారానే తెలుసుకుందాం…
ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
కరోనా సమయంలో అంటే 2020లో నేనూ, నా తొమ్మిదేండ్ల తమ్ముడు సూర్య ఇంట్లోనే ఉండి చదువుకునే వాళ్ళం. అప్పుడే సూర్యకు టైప్‌ 1 డయాబిటిస్‌ ఉందని తెలిసింది. ఆ వ్యాధి పెద్ద వాళ్ళకు కదా వచ్చేది చిన్న పిల్లలకు ఎందుకు వచ్చిందనా ప్రశ్న నాలో మొదలయింది. మా అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లే. అయినా తమ్ముడి పరిస్థితి చూసి కంగారు పడ్డారు. చిన్నవాడైన తమ్ముడి పరిస్థితి మరీ దారుణం. ఫుడ్‌ కంట్రోల్‌ చేసుకోవాల్సి వచ్చింది. తనకు ఎంత చెప్పినా అర్థమయ్యే వయసు కాదు. అమ్మా, నాన్న చాలా జాగ్రత్తగా సూర్యకు ట్రైనింగ్‌ ఇచ్చారు. మెల్లగా తన జీవన శైలిని మార్చుకున్నాడు. అప్పట్లో తమ్ముడితో పాటు నేనూ ఆస్పత్రికి వెళుతుండేదాన్ని. ఈ వ్యాధి గురించి డాక్టర్లను ఎన్నో ప్రశ్నలు అడిగేదాన్ని. దీని గురించి ఇంకా తెలుసుకోవాలని పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.
ఈ అధ్యయనంలో మీరు గుర్తించిన అంశాలు..?
డయాబెటిస్‌ మానసికంగా చాలా ఇబ్బంది కలిగిస్తుందని నా అధ్యయనంలో తెలుసుకున్నాను. కొన్ని నివేదికల ప్రకారం మన దేశంలో టైప్‌ 1 డయాబెటిస్‌ బారిన పడిన పిల్లలు సుమారు 96 వేల మంది ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. పైగా ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతూ ఉంది. వాళ్ళు జీవితాంతం ఇన్సులిన్‌తో పాటు ఇతర వైద్యం తీసుకోవల్సిన అవసరం వుంటుంది. జీవించినన్ని రోజులు ఫుడ్‌ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఆర్థికంగా కాస్త ఉన్నవారైతే ఇబ్బంది లేదు కానీ నిరుపేద పిల్లలకు ఈ వ్యాధి వస్తే ఏంటి పరిస్థితి అనే సందేహం వచ్చింది. అందుకే నిస్సహాయులైన అలాంటి వారికి నా వంతుగా సాయం చేయాలనుకున్నాను. అదే 2021లో ప్రాజెక్ట్‌ సూర్యగా అవతరించింది.
మీరు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు?
ప్రధానమైనది ఏమిటంటే నా వయసు. మాకు అవసరమైన సహకారం కోసం కొన్ని సంస్థల వద్దకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలం కాబట్టి మా సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసేవారు. దాంతో ముందు వారి వద్ద మా సామర్థ్యం ఏమిటో నిరూపించుకోవల్సి వచ్చేది. కొన్నిసార్లు ఎదురుదెబ్బలు, వైఫల్యాలను కూడా ఎదుర్కొన్నాం. కానీ ఈ అనుభవాల నుండి చాలా నేర్చుకుంటున్నాం. అలాగే గత ఏడాది నేను పదో తరగతి పూర్తి చేశాను. అప్పుడు చదువు, ప్రాజెక్ట్‌ పనులు సమన్వయం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అయినా మా అమ్మానాన్న, ఫ్రెండ్స్‌ నాకెంతో సపోర్ట్‌ చేశారు. ‘టచ్‌, మూవ్‌ అండ్‌ ఇన్స్పైర్‌’ అనేది మా అమ్మ నాకు నేర్పింది.
అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నట్టున్నారు..?
అవును, ఇప్పుడు మా ప్రాజెక్ట్‌ను మన దేశంలోనే కాక విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా ఎంతో మెచ్చు కుంటున్నారు. 2023 జూలైలో ‘డయానా అవార్డు’ అందుకున్నాను. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. గత నవంబర్‌లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘1ఎం1బి – యాక్టివ్‌ యూత్‌ సమ్మిట్‌’లో నా ప్రాజెక్ట్‌ గురించి వివరించే అవకాశం వచ్చింది. ఇప్పుడే ప్రాజెక్ట్‌ సూర్యను దేశమంతటా విస్తరింపజేసేందుకు కృషి చేస్తున్నాను.
ఈ ప్రయాణంలో మీకు ఆనందాన్ని ఇచ్చిన అంశాలు ఏమిటి?
మేము నిర్వహించే ప్రతి సెషన్‌కు పిల్లల నుండి మాకు విపరీతమైన స్పందనలు వస్తాయి. ఇది నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ‘అక్కా, నేను నీలా మారాలనుకుంటున్నాను’ ఇలాంటి మాటలు ఈ పిల్లలకు పెద్ద కలలు కనే ఆత్మవిశ్వాసాన్ని అందించడం నా కర్తవ్యమని నాకు గుర్తు చేస్తాయి. కొన్నిసార్లు వందలాది మంది పిల్లలు మా వద్దకు వస్తారు. నన్ను ఆప్యాయంగా కౌగిలించుకొని హై ఫైవ్‌లు ఇస్తుంటారు. అప్పుడు మేము పొందే ఆనందానికి అవధులు ఉండవు. వారు చాలా ఆశతో మా వద్దకు వస్తారు. వారి ఆశను సజీవంగా ఉంచడం, వారు అభివృద్ధి చెందడానికి అవసరమైన చిన్నపాటి సహాయం చేయడం నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మారుమూల గ్రామాల నుండి వచ్చిన ఈ పిల్లలు అనేక ప్రాణాంతక సవాళ్లను అధిగమిస్తూ నాలో స్ఫూర్తినింపుతున్నారు.
మిమ్మల్ని కొనసాగించేలా చేస్తున్నది ఏమిటి?
నా తమ్ముడు సూర్య ప్రయాణం స్ఫూర్తితో ప్రాజెక్ట్‌ సూర్య ప్రారంభించాను. అతనే నా అతిపెద్ద ప్రేరణ. ఈ పిల్లల ముఖాల్లో చిరునవ్వు, వారి కళ్ళు వారి తల్లిదండ్రుల హృదయపూర్వక కృతజ్ఞతతో పాటు ఆనందంతో మెరుస్తూ ఉండటం నన్ను కొనసాగించేలా చేస్తుంది. వారు తమను తాము విశ్వసించడాన్ని చూడటం కంటే మరేదీ నాకు ఆనందాన్ని ఇవ్వదు. ఉత్సాహభరితమైన నా బృందం సభ్యులు, నిత్యం నాకు అండగా నిలబడుతున్న నా తల్లిదండ్రులు నన్ను సానుకూల ఆలోచనల వైపు తీసుకెళుతున్నారు. ఇదే నన్ను కొనసాగించేలా చేస్తుంది.
మీలాంటి యువతకు మీరిచ్చే సందేశం?
మీరు ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పుగా ఉండండి. చిన్నదైనా, పెద్దదైనా మీకు ఇష్టమైన విషయాల వైపు ఈరోజే ఒక అడుగు వేయండి. ఇవ్వడం వల్ల మీరు పొందే ఆనందం అసమానమైనది. మంచిని నమ్మండి, మానవత్వాన్ని సజీవంగా ఉంచండి.
ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం ఏమిటీ..?
డయాబెటిస్‌కు గురైన పిల్లలకు, వారి కుటుంబాలకు ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, అవసరమైన సహాయం అందించడం మా లక్ష్యం. దీని కోసం నా కుటుంబంతో పాటు స్నేహితులు, బంధువుల సాయం తీసుకున్నాను. డయాబెటిస్‌ వచ్చిన పిల్లల ఇండ్లకు వెళ్ళి అవసరమైన జాగ్రత్తలు చెబుదాం. సదస్సులు ఏర్పాటు చేసి వారిని అహ్వానిస్తాం. వైద్యులు, డైటీషియన్లతో సూచనలు ఇప్పిస్తాం. అలాగే దీనివల్ల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాం. దీని కోసం అవసరమైన నిధుల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ చేస్తుంటాం. అలాగే వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్నాం. ఇన్సులిన్‌, గ్రూకోజ్‌ స్ట్రిప్స్‌, సిరెంజిలు కూడా చాలా మంది మాకు విరాళంగా ఇస్తుంటారు.
– సలీమ.

Spread the love