ఈ ఏడాదిలోగానే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా : మాజీ ప్రధాని షేక్ హసీనా
న్యూఢిల్లీ : మరణమంటే తనకు భయం లేదని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా అన్నారు. ఈ ఏడాదిలోగానే తాను తిరిగి బంగ్లాదేశ్ వెళ్తానని తెలిపారు. తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో స్వదేశాన్ని వీడి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ అవామీ లీగ్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అదొక శక్తి అని ఆమె చెప్పుకొచ్చారు. మైనారిటీలపై జరిగిన ఎలాంటి దాడి అయినా బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై దాడితో సమానమని వ్యాఖ్యానించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఒక జాతీయ వార్తా సంస్థకు ఆదివారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పారు. అందులోని ముఖ్యాంశాలు.. బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసమే తాను రాజకీయాలు చేస్తానని, చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన, రాజకీయ ప్రేరేపిత ప్రక్రియలో భాగంగా తనపై న్యాయవ్యవస్థను రాజకీయ ప్రతీకార సాధనంగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయని అప్పుడు అవి విఫలమయ్యాయని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. “నేను చావుకు భయపడను.
1975లో నేను నా తల్లిదండ్రులు, సోదరులు సహా నా యావత్ కుటుంబాన్ని కోల్పోయాను. ప్రజల ఓట్లతో ఐదుసార్లు బంగ్లా ప్రధాని అయ్యాను. దేశాభివృద్ధికి కృషి చేశాను. నా జీవితం దాదాపుగా బంగ్లా ప్రజలు, అవామీ లీగ్, ప్రజాస్వామ్య పోరాటం, దేశాభివృద్ధికి అంకితమైంది. అందుకే నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ప్రతి అడ్డంకిని, ప్రతి కుట్రను అధిగమించి ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను. అవామీ లీగ్ అనేది కేవలం కాగితాలకే పరిమితమైన సంస్థ కాదు. తన 77 ఏళ్ల ప్రస్థానంలో అనేక సార్లు దాడులకు గురైంది. రక్తపాతాన్ని ఎదుర్కొంది. నిషేధానికి కూడా గురైంది. కానీ ప్రతిసారీ ప్రజల శక్తితో అది తిరిగి పుంజుకుంది. మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవిశ్రాంతం గా కృషి చేశాం. బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదోవ పట్టించి కుట్రపూరితమైన, పకడ్బందీగా రూపొందించిన ఉద్యమం ద్వారా అవామీ లీగ్‌ను అధికారానికి దూరం చేశాయి. వారు ఎన్ని చేసినా ప్రజల హృదయాల నుంచి అవామీ లీగ్‌ను చెరిపివేయలేకపోయారు.” అని ఆమె పేర్కొన్నారు.
కాగా బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన లేదని షేక్ హసీనా ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లో సరైన ప్రజాస్వామ్య వాతావరణం, స్థిరత్వం నెలకొనాలంటే అవామీ లీగ్‌పై ఉన్న అక్రమ నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేసి..శాంతియుత రాజకీయ కార్యకలాపాలను అనుమతించాలని కోరారు. బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన దాడులను షేక్ హసీనా ఖండించారు. బంగ్లాదేశ్‌లో మతతత్వ శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడల్లా మైనారిటీలపై భయంకరమైన హింస జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరణమంటే భయం లేదు
- Advertisement -
- Advertisement -



