Wednesday, July 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకలలు చూపించి కొల్లగొట్టారు

కలలు చూపించి కొల్లగొట్టారు

- Advertisement -

ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం
మేడిగడ్డను కుంగకొట్టి కరువంటున్న హరీశ్‌రావు
పదేండ్ల అరాచకం, రెండున్నరేండ్ల ప్రజాపాలనపై చర్చకు సిద్ధం
విద్యార్థులపై లాఠీచార్జి మోడీ నియంతపాలనకు నిదర్శనం : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్

నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. పదేండ్ల పాటు అరాచక పాలన సాగించారు. కాళేశ్వరం పేరిట ప్రజలకు ఎన్నో కలలు చూపించి లక్ష కోట్ల నిధులు గోదావరి పాలు చేశారు. తాపీ, ఇంజినీర్, మేస్త్రీ.. నేనే అని కేసీఆర్ అంటూ లోపభూయిష్ట ప్లాన్‌తో కాళేశ్వరాన్ని ముంచారు. మేడిగడ్డ కుంగడంలో హరీశ్‌రావు బాధ్యత లేదా..? ఉద్యోగాల పేరిట కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో, రెండున్నరేండ్ల కాంగ్రెస్ హయాంలో కల్పించిన ఉద్యోగాలు, అభి‌వృద్ధిపై చర్చకు సిద్ధమా..?’ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం కేటీఆర్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని, కుటుంబం నిండా ఉద్యోగాలు కల్పించుకున్నారని ఆరోపించారు. వారి హయాంలో 30-35 వేల ఉద్యోగాలిస్తే.. తమ హయాంలో 70 వేల వరకు ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. ఇప్ప్పుడు బావబామ్మర్దులు బజార్లపడి అబద్దాలు మాట్లాడుతున్నారని.. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

మోడీది నియంత పాలన
నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించి అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలన్న న్యాయమైన డిమాండ్‌తో ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జి చేయడం.. అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. నియంత పాలనలో ఉన్నామా అని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం బీజేపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విస్మరించారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం, లీజ్‌కు ఇస్తూ ఉన్న ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ జిల్లా, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నగేశ్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -