Monday, September 7, 2026
E-PAPER
Homeఖమ్మంగిరిజన యువతి ఊకే శిరీష హత్యకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలి

గిరిజన యువతి ఊకే శిరీష హత్యకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

– మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
– ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి 
– నర్సింగ్ విద్యార్థినులతో కొవ్వొత్తుల ప్రదర్శన 
నవతెలంగాణ-సత్తుపల్లి 

గిరిజన యువతి, నర్స్ ఊకే శిరీష హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నర్సింగ్ కళాశాల నుంచి విద్యార్థినులతో ఐద్వా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శన స్థానిక బోసు బొమ్మ వరకు సాగింది. అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమంలో మాచర్ల భారతి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు శీలం కరుణ మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంకు చెందిన 21 ఏళ్ల నర్సు ఊకే శిరీష హైదరాబాద్‌ తుక్కుగూడలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకుని నర్సుగా ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న శిరీష దారుణ ఘటనకు బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పోలీసుల దర్యాప్తులో బీహార్‌కు చెందిన ఎండీ సనావుల్లా ఖాన్‌ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించి, ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని వారు తెలిపారు. ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్‌ కేసుగా చూడకుండా, ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మాచర్ల భారతి కోరారు. మహిళా హాస్టళ్లు, ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలు, విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అత్యవసర స్పందన వ్యవస్థలను తప్పనిసరి చేయాలని సూచించారు. మహిళలు రాత్రివేళ బయటకు రావడం లేదా ఒంటరిగా జీవించడం నేరానికి కారణం కాదని, నేరానికి పాల్పడిన వ్యక్తినే బాధ్యుడిగా చూడాలని పేర్కొన్నారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు, కేసును వేగంగా దర్యాప్తు చేసి నేరం రుజువైతే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆడపిల్లలకు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం మాత్రమే కాదని,  నీకు ఏం జరిగినా మేమున్నామనే భద్రతా వాతావరణాన్ని సమాజం కల్పించాలన్నారు. శిరీష మరణం సామాజిక మార్పుకు నాంది కావాలన్నారు. ఐద్వా పట్టణ అధ్యక్షురాలు చెరుకు రత్నకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకురాళ్లు పుష్పవల్లి, రజిని, సుబ్బలక్ష్మి, కరుణ, ప్రభ, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -