– సీఐటీయూ నాయకులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతన సలహా మండలిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ వంటి కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అశ్వారావుపేట హమాలీ అడ్డ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల శ్రమకు తగిన కనీస వేతనాలు నిర్ణయించాలని దేశవ్యాప్తంగా కార్మికులు పోరాడుతున్నారని తెలిపారు.
కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సంఘాలను విస్మరించి, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించే సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, వారి ప్రాతినిధ్యాన్నే తొలగించడం సరికాదన్నారు. కనీస వేతన సలహా మండలిలో సీఐటీయూ సహా ఇతర కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఏసు, నాగేంద్ర, రాంబాబు, కాసిం, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



