– చౌకబారు విమర్శలకు అభివృద్ధే సమాధానం
– రూ.40 కోట్లతో రోడ్ల విస్తరణ.. రూ.36 కోట్లతో ఆసుపత్రి అభివృద్ధి
– రూ.200 కోట్లతో సమీకృత పాఠశాల నిర్మాణం
– మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ జూపల్లి రమేష్‌బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్, యువ నాయకుడు జూపల్లి రమేష్‌బాబు అన్నారు. చౌకబారు విమర్శలకు మాటలతో కాకుండా అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఆసుపాక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన పండుగ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా విమర్శలు చేస్తున్నారని అన్నారు. కళ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత కూడా విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము చేసిన అభివృద్ధిని, తీసుకొచ్చిన నిధులను ప్రజలకు వివరించుకునే హక్కు ఉంటుందని తెలిపారు. నిధులు తీసుకురాకుండా కేవలం విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రోడ్ల విస్తరణకు దాదాపు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టినట్టు తెలిపారు. గతంలో సమస్యాత్మకంగా ఉన్న రహదారుల రూపురేఖలు మార్చేలా పనులు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి దాదాపు రూ.36 కోట్ల నిధులతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించే వారు ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి పనులను పరిశీలించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు దాదాపు పది మంది వైద్యులను అందుబాటులోకి తీసుకురావడంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు.
పట్టణంలో మధ్య దీపాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీగా ఏర్పడకముందు పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోనే సుమారు రూ.4 కోట్లతో మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు నిర్మించినట్టు వివరించారు.
గురుకుల పాఠశాల, సమీకృత పాఠశాల నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్ల నిధులను మంత్రుల సహకారం, ముఖ్యమంత్రి దీవెనతో తీసుకొచ్చి పనులు వేగంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నదన్నారు.
వెయ్యి రోజుల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసిన తర్వాత కూడా చౌకబారు విమర్శలు చేయడం ప్రజల తీర్పును అవమానించడమేనని రమేష్‌బాబు అన్నారు. మాటలతో రాజకీయాలు చేసేవారికి పనులతోనే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.



