– 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
– చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు
– ఎస్పీ రాజేష్ చంద్ర
నవతెలంగాణ – కామారెడ్డి
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను 24 గంటల పాటు పనిచేసే విధంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పండుగ సమయంలో ఎవరైనా అనుమానాస్పద ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గమనిస్తే వెంటనే జిల్లా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 8712686133 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో 6 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, అక్కడ 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
వాహనాలను ఆపడం లేదా తనిఖీలు నిర్వహించే అధికారం కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటుందని, వ్యక్తులు లేదా సంస్థలు స్వయంగా తనిఖీలకు దిగడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలపై ద్వేషపూరిత, రెచ్చగొట్టే లేదా మత సామరస్యాన్ని దెబ్బతీసే పోస్టులు, వీడియోలు ప్రచారం చేసే వారిపై పోలీసు నిఘా ఉంటుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవం, సోదరభావంతో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలందరూ పోలీసులతో సహకరించి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.



