కాలపు సడి

Time is coming‘గడియారం, పెట్టుకున్న ప్రతివాడూ, పరిగెడుతున్న కాలాన్ని పట్టుకోలేడు!’ అంటాడు అలిశెట్టి. అవును కాలాన్ని చూడటమే కాని పట్టు చిక్కదుగా! పరీక్షిస్తే కాలం ఓ వేగంగా కదిలే కత్తి. చేతిలోకి తెచ్చుకుంటే విజయం. లేదంటే గాయం. ఇదీ కవితాకాలం. ఉశ్ఛ్వాస నిశ్వాసలే కాలం. పరుగులో మొదటి అడుగు పడటం కాలం. బిందువు నుండి బిందువుకు కదిలే సడికాలం. ఏమైనా అర్థం కాకపోతే స్టీఫెన్‌ హాకిన్స్‌ను కనుక్కోవాలి! ఆయన కూడా కాలానికి చిక్కేసాడు. అందుకే మనం కాలంతో పాటుగా బుద్ధిగా ఏదో ఒకటి సరిదిద్దు కోవాల్సింది దిద్దుకుంటూనే ఉండాలి. లేదంటే గతించిన కాలం మన ప్రోగ్రెస్‌ రిపోర్టును తయారు చేసి సిద్ధంగా ఉంచుతుంది. గతంలోనే కాలాన్ని పరిశీలించటం చేయగలం. అదీ మన పనుల ఆధారంగా ఇప్పుడీ కాలపు గొడవేమిటంటే, పాత క్యాలెండరు గడిలోంచి కాలం, కొత్త గడీల గృహంలోకి అడుగులు వేస్తోంది. అందుకే ఈ ఉత్సవం.
ఏది ఏమైనా మన కోసం కాలం తప్ప కాలం కోసం మనం కాదు గనక. మనమిప్పుడు కాలంలో మన కోసం మాట్లాడుకోవాలి. కొత్త సంవత్సరం ఆరంభాన ఎగిరి గంతులేస్తాము. సంబురాలు చే స్తాము. ఏదో కొత్తదనం మన జీవితాన వస్తుందని రావాలన్న కోరికా వుంటుంది. ఇందులో పెద్ద అభ్యంతరకరమైనదేమీ లేదు. కానీ మన ఆశలేమిటి, లక్ష్యాలేమిటి, అవెలా నెరవే రుతాయి అనే ఆలోచన చాలా ముఖ్యమయింది. మనకు ఎదురౌతున్న సమస్యలు, సవాళ్లు మనమే వైయక్తికంగా పరిష్కరించుకోగలిగేవేనా! ఎదుర్కోవలసిందేనా! లేదు సమూహమంతా కలిసి ఎదుర్కోవలసినవా! అనేదే అసలు విషయం. మొత్తం సమాజంలో మనం ఒక భాగం అనే గ్రహింపు రావాలి. కానీ నేటి సాం స్కృతిక ఆలోచనలన్నీ వ్యక్తుల చుట్టూ ఓ ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయి. పరిష్కా రాలనూ వైయక్తికం చేస్తున్నాయి. ఈ ఆలోచనా ధోరణియే ప్రపంచమంతా పాకుతున్నది. ఇది ఎదురయ్యే సమస్యలకు అసలు కారణాలను తెలియకుండా దాస్తున్నది.
ఇపుడు ఎదురవుతున్న సమస్యలలో తెలివైన అజ్ఞానం. ఈ అజ్ఞానం కంటే ప్రమాదకరమైనది మూఢత్వం. అంటే హేతువు జోలికి వెళ్లం. ఎందుకంటే నిజాలు మనల్ని భయంకరంగా భయపెడతాయి కనుక. అంటే సాంస్కృ తికంగా ఒక అహేతుక మానవ నిర్మాణానికి అంకురార్పణ జరుగుతోంది. ఇది మన పరి స్థితికి మనల్నే బాధ్యులను చేస్తుంది. మనకు మనమే పూనుకుని మార్చు కోవాల్సిన కర్తవ్యాన్ని నీరుకారుస్తుంది. నిర్బలునిగా నిలబెడుతుంది. పైగా ఇవన్నీ పరిష్కరించే వాడు వేరే ఉన్నాడని నిలబెడుతుంది. దాని చుట్టూ ఒక భ్రమాత్మక భ్రమణం మొదలవుతుంది. అలా పుట్టిందే మతం. అంతవరకూ అలా పరిణ మించినా, ఇపుడు మతతత్వంగా విద్వేషాలను వెళ్లగక్కుతోంది. ప్రజాస్వామి కతకు, అసలు మానవీయతకు పెను ప్రమాదంగా మారుతున్నది. ఈ సమస్య కన్నా ముందుగానే ఆర్థిక పరమైన ఒత్తిడిని ఎదుర్కోంటున్నాము. ఆదాయం లేని వారి బాధ అటుంచి మంచి ఆదాయం ఉన్నవారు సైతం ఆర్థిక ఒత్తిడికి లోనవుతు న్నారు. అనేక అవసరాల అనివార్యతను సృష్టిస్తున్న వ్యాపార వస్తు వినియోగతత్వం చుట్టుముడుతున్నది. మనిషిగా బ్రతకటానికి, మంచి ఉన్నత మనిషిగా బతక టానికి ఎన్ని కావాలో, ఏమేం కావాలో రిలయన్స్‌ మార్ట్‌లు, ట్రెండ్స్‌, మాల్స్‌ నిర్దేశిస్తాయి. ఇక జీతం, జీవితం తాకట్టు పడ్డాక మన జుట్టు వాడి చేతులోనే! పక్క కు తలతిప్పే సందే ఇవ్వదు. ప్చ్‌! ఏం చేస్తాం! మన గురించి మనం ఆలోచించు కోవటానికి సమయం దొరకని తనంలో కొట్టుమిట్టాడుతాము.
ఇలాంటి స్థితిలో గడచిన కాలంలో జరిగిన అమానుషాలను సమీక్షించ గలుగుతామా! గాజాలో పసి పిల్లలను శవాలుగా మార్చిన సామ్రాజ్యవాద కుట్ర లను తెలుసుకోగలమా! తమ దేశంలోనే తమకు జానెడు జాగా లేకుండా పోతున్న పాలస్తీనా పరిస్థితిని వినగలుగుతున్నామా! అంతెందుకు మన దేశంలోనే మణి పూర్‌ నిలువునా మనుషుల్ని తగలేస్తున్న దారుణ రాజ్యహింసని, మానవ హక్కుల హసనాన్ని ఆపగలిగామా! ఇంకో వైపు రాజ్యాంగ మౌలిక సూత్రాల విధ్వంసం జరుగుతుంటే, ప్రజాప్రతినిధులనే సభనుండి బయటికి గెంటి వేయబడుతుంటే, ప్రజాస్వామ్యం గొంతునులుముతుంటే ఏం చేయగలిగాము. వార్తా సంస్థల మీద జర్నలిస్టుల మీద ఉక్కుపాదాల్ని మోపుతుంటే, దుశ్శాసన వారసులు అధికార పక్షం చేరి ప్రశ్నలను అవహేళన చేస్తుంటే ఏం స్పందిస్తున్నాం! ఇలా అడగటం నిరాశ తో కాదు. ఒక దుర్వవస్థ మనపై పైచేయి సాధించినపుడు బలహీనంగానే కనప డతాం. ఏమీ చేయలేని వారంగానే మిగిలిపోతాం. కానీ ఇదే శాశ్వితం కాదు. అసమంజసమైనదీ, అసత్యమైనదీ కనుమరుగు కాక మానదు. శక్తిని కూడ దీసు కుని ధైర్యంగా ఎదురీదడమే మనం చేయాల్సిన పని. ఆశయం, లక్ష్యం కలిగి ఉండటం, నిబద్ధంగా నిమగ మవ్వడం అందుకు పునాది. ఈ నూతన సంవత్సర కాలపుసడిలో మనల్ని మనం జాగృత పర్చుకొని ముందుకు మునుముందుకు సాగుదాం!

Spread the love