తీన్మార్‌ మల్లన్నకు లక్షకు పైగా మెజార్టీ పక్కా..

తీన్మార్‌ మల్లన్నకు లక్షకు పైగా మెజార్టీ పక్కా..– ఈ ఉప ఎన్నికకు సూత్రధారులెవరో పట్టభద్రులకు తెలుసు
– బీఆర్‌ఎస్‌, బీజేపీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్న గెలుపును కేసీఆర్‌ ముక్కు నేలకు రాసినా ఆపలేరని, లక్షా పాతికవేల మెజారిటీతో ఘన విజయం సాధించడం పక్కా అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్‌ మండలంలోని టీసీవీరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పాలేరు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తీన్మార్‌ మల్లన్నపై 100 కేసులు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వారు అంటున్నారని, కానీ గత ముఖ్యమంత్రి నియంతపోకడను, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే ఈ అక్రమ కేసులు బనాయించి.. జైల్లో పెట్టి పైశాచికానందం పొందారని ఆరోపించారు. గత ఎన్నికల్లోనే తీన్మార్‌ మల్లన్న గెలిచేవాడని, గట్టి పోటీ ఇచ్చారని.. కేసీఆర్‌ తిమ్మిని బమ్మి చేసి గట్టెక్కారని విమర్శించారు. ఈ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్‌ వైఫల్యంతో వచ్చిందని.. పట్టభద్రులంతా తీన్మార్‌ మల్లన్నను గెలిపించి, ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి.. ఉన్న ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని, లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న కొద్ది సీట్లూ ఊడతాయని అన్నారు.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్‌, కేటీఆర్‌ కుతంత్రాలు చెల్లబోవని అన్నారు. బీఆర్‌ఎస్‌ పట్టభద్రులను రోడ్డున పడేసిందని, వారి స్వార్థానికే ఈ ఉప ఎన్నిక వచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ వారు అమెరికా నుంచి అభ్యర్థిని దించారని, తాను చదివింది సర్కారు బడిలోనే అయినా వందమందికి విద్యా బోధన చేయిస్తున్నానని అన్నారు. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచానని, కేసులకు బెదరలేదని, ప్రాణం ఉన్నంతవరకు జనం బాటలోనే నడుస్తానని చెప్పారు. పట్టభద్రులు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ రఘునాథ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్‌, రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ మువ్వా విజయబాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకులు దండి సురేష్‌, జెడ్పీటీసీ బెల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Spread the love