నవతెలంగాణ-ఆలేర్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆలేరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రతిభతో మెరిశాయి.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు గొలనుకొండ, కొల్లూరు, శారజీపేట, శ్రీనివాసపురం, టంగుటూరు పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించారు. కొలనుపాక పాఠశాల 96% ఉత్తీర్ణతతో మంచి ఫలితాలు నమోదు చేసిందని ఆలేరు మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మండల విద్యాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలల వారీగా పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో టాపర్లుగా నిలిచారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శారజీపేటకు చెందిన ఎన్. రేష్మ 554/600 మార్కులు సాధించగా, పీఎం శ్రీ ఉన్నత పాఠశాల కొలనుపాకకు చెందిన బి.భావన 540/600 మార్కులు సాధించింది.
జిల్లా పరిషత్ పాఠశాల శ్రీనివాసపురం కి చెందిన బి. అక్షయ, ఎన్. తేజస్విని 536/609 మార్కులతో ప్రతిభ చాటగా, టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన బి.శ్వేత 518/600 మార్కులు సాధించింది. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్లూరు కు చెందిన కే.ఝాన్సీ 516/600, గొలనుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జై హేమంత్ 453/600 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యాలను మండల విద్యాధికారి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయని,విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించగలరని ఆమె పేర్కొన్నారు.



