నవతెలంగాణ-కాటారం
దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నీట్-2026 పరీక్షలో పేపర్ లీకేజీ ఘటన అత్యంత దారుణమని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మండిపడ్డారు. కాటారంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజస్థాన్‌లోని సికర్ ప్రాంతం నుంచి లీక్ నెట్‌వర్క్ బయటపడిందని, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నాపత్రం ప్రచారం జరిగిందని ఆరోపించారు.
పరీక్ష నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు కష్టపడి చదువుతుంటే డబ్బు, కోచింగ్ మాఫియా, అవినీతి ఆధారంగా కొందరికి ప్రశ్నాపత్రాలు చేరడం ప్రమాదకరమన్నారు.
నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకులు అయిత బాపు, దాసరి రమేష్, దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



