నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో విషాదం..

నవతెలంగాణ -హైదరాబాద్‌: నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో నిన్న విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఏనుగుల శాలలో సంరక్షకుడిగా పనిచేస్తున్న షాబాజ్‌(22)ను విజయ్‌ అనే ఏనుగు తొక్కి చంపింది. జూపార్కు ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ఉత్సవాల్లో షాబాజ్‌ పాల్గొన్నారు. అనంతరం ఇంటికి వెళ్లేముందు.. ఏనుగుల గదిలో ఉంచిన దుస్తుల కోసం వెళ్లాడు. ఆ సమయంలో విజయ్‌ అనే ఏనుగు అతణ్ని తొండంతో లాక్కొని విసిరి కొట్టింది. మృతదేహాన్ని చూస్తే కాళ్లతో తొక్కినట్లుగా అనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు. ‘‘ఏనుగు పెద్దగా అరుస్తూ షాబాజ్‌పై దాడి చేసింది. సమీపంలోని జంతు సంరక్షకులు అప్రమత్తమై అక్కడికి చేరుకునేసరికే షాబాజ్‌ అచేతన స్థితిలో కనిపించాడు. అతన్ని  బయట తీసుకొచ్చి.. అంబులెన్సులో డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు’’ అని జూపార్కు డైరెక్టర్‌ ప్రసాద్‌, క్యూరేటర్‌ సునీల్‌, డిప్యూటీ డైరెక్టర్‌ నాగమణి ప్రకటించారు. జూలో జంతువు దాడిలో సంరక్షకుడు మరణించడం ఇదే తొలిసారని వెల్లడించారు.

Spread the love