విహార యాత్రలో విషాదం..!

Tragedy in the trip..!– మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం..
– నలుగురు ఆదిలాబాద్‌ జిల్లావాసులు మృతి
– మరో నలుగురికి తీవ్రగాయాలు
నవతెలంగాణ- తాంసి
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చిక్కల్‌ధరి అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం తెల్లవారు జమున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఆదిలాబాద్‌ జిల్లాకు చెందినవారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని భీంపూర్‌ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన యువకుడు షేక్‌ సల్మాన్‌కు చెందిన ఏర్టీగా వాహనంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులతో పాటు అర్లి గ్రామ సర్పంచ్‌ తనయుడితో కలిసి మొత్తం ఎనిమిది మంది మహారాష్ట్రలోని పర్యాటక ప్రాంతమైన చిక్కల్‌ధరికి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం చిక్కల్‌ధరికి సమీపంలోని హిల్‌ స్టేషన్‌ వద్ద అదుపుతప్పి రోడ్డుపై నుంచి 200 ఫీట్ల లోతులోని లోయలోకి దూసుకెళ్లింది. కాగా వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు యువకులు ఘటనా స్థలంలోని మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో వాహన యజమాని, డ్రైవర్‌ షేక్‌ సల్మాన్‌ (31), గ్రామ సర్పంచ్‌ కుమారుడు వైభవ్‌ (29), భీంపూర్‌ గ్రామీణ బ్యాంక్‌ క్యాషియర్‌ కోటేశ్వరరావు (27), కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ క్యాషియర్‌ శివకృష్ణ (31) ఉన్నారు. గాయపడిన వారిలో బ్యాంకు ఉద్యోగులు సుమన్‌, యోగేష్‌, హరీష్‌, శ్యామ్‌రాజ్‌ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిక్కల్‌ధరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా విహార యాత్ర కోసం వెళ్లిన యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Spread the love