ప్రధాని తీరుతో నిరాశలో గిరిజనులు

– మణిపూర్‌ సమస్యపై ఆయన కేటాయించిన సమయం సరిపోదు
–  ఎన్డీయే భాగస్వామి ఎంఎన్‌ఎఫ్‌ ఎంపీ అసంతృప్తి
న్యూఢిల్లీ : జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌ విషయంలో ప్రధాని మోడీ తీరుపై మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) ఎంపీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఆయన మణిపూర్‌పై కేటాయించిన సమయం ఏ మాత్రమూ సరిపోదని అన్నారు. మోడీ తీరుతో మిజోరాం, మణిపూర్‌లోని గిరిజనులు నిరాశకు గురయ్యారని తెలిపారు. ప్రతిపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన సమాధానంలో భాగంగా ప్రధాని మోడీ రెండు గంటల 13 నిమిషాల రికార్డు స్థాయి సుదీర్ఘ ప్రసంగాన్ని వినిపించిన విషయం విదితమే.అయితే, ఆ ప్రసంగంలో ఆయన మణిపూర్‌ అంశాన్ని అంతగా తీసుకురాకుండా జాగ్రత్త పడ్డారు. ఎంఎన్‌ఎఫ్‌ లోక్‌సభ సభ్యుడు సి. లాల్‌రోసంగ ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆందోళనను వెలిబుచ్చారు. ” మోదీ తన ప్రసంగంలో మణిపూర్‌కు కేటాయించిన సమయం సరిపోదు. అన్నింటికంటే ముందుగా అతను ముందుగా మణిపూర్‌ సమస్యను పరిష్కరిస్తాడని నేను ఊహించాను. అభివద్ధి గురించి మాట్లాడే ముందు, చాలా విషయాలు చెప్పుకునే ముందు, అతను మొదట మణిపూర్‌ గురించి మాట్లాడాలి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే ఆయన మణిపూర్‌ గురించి మాట్లాడి ఉండాల్సింది” అని ఎంఎన్‌ఎఫ్‌ ఎంపీ అన్నారు.

Spread the love