టీఎస్‌యూటీఎఫ్‌ ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ షేక్‌ మహబూబ్‌ అలీ ఆకస్మిక మృతి

టీఎస్‌యూటీఎఫ్‌ ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ షేక్‌ మహబూబ్‌ అలీ ఆకస్మిక మృతి– ఎమ్మెల్సీ నర్సిరెడ్డి,టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఆఫీసు బేరర్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌, ఖమ్మం జిల్లా సీనియర్‌ నాయకుడు షేక్‌ మహబూబ్‌ అలీ (60) ఆకస్మికంగా శుక్రవారం మరణించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయసకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వచ్చేనెల ఎనిమిదో తేదీన నిర్వహించబోయే తన కుమార్తె వివాహ నిమిత్తం పెళ్లి బట్టలు, ఆభరణాల కొనుగోలు కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. కూకట్‌పల్లిలోని ఒక నగల దుకాణంలో షాపింగ్‌ చేస్తూ తీవ్రమైన గుండెపోటు తో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. సమాచారం తెలిసిన వెంటనే టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, నాయకులు డి మస్తాన్‌ రావు ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భౌతికకాయాన్ని ఖమ్మం పంపించేందుకు సహకరించారు. శనివారం మధ్యాహ్నం ఖమ్మంలో మహబూబ్‌ అలీ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు
మహబూబ్‌ అలీ 1989లో చింతూరు మండలంలో ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. అప్పటినుంచి యూటీఎఫ్‌లో చురుకుగా పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ మండలాల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సంఘం విస్తరణకు విశేష కృషి చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యునిగా, గత రెండేండ్లుగా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా, రాష్ట్ర ఆఫీసు బేరర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచారు. జిల్లా, మండల కమిటీల జమా ఖర్చుల నిర్వహణ, ఆడిటింగ్‌పై కార్యకర్తలకు తర్ఫీదునిచ్చారు. సంఘ కార్యక్రమాల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ ముక్కుసూటిగా వ్యవహరించేవారు. ఉపాధ్యాయుల సర్వీసు విషయాలపై మంచి అవగాహన కలిగి తరగతులను బోధించేవారు. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారు. మంచి ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆయన అన్ని పాఠశాలల్లోనూ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం గ్రామీణ మండలం ఎంవి పాలెం ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
అలీ మరణం ఉపాధ్యాయులకు తీరనిలోటు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ మహబూబ్‌ అలీ మరణం ఉపాధ్యాయులకు తీరనిలోటని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయాం : టీఎస్‌యూటీఎఫ్‌
నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవటం సంఘానికి, ఉపాధ్యాయులకు తీరని లోటని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయన మరణం పట్ల టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సంతాపం, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Spread the love