మురుగునీటి గదిలో ఇద్దరు దళితులు బలి

–  శుభ్రం చేస్తూ ఊపిరాడక మృతి
–  తమిళనాడులో ఘటన
చెన్నై : తమిళనాడులోని అవడిలోని ఆర్డినెన్స్‌ బట్టల ఫ్యాక్టరీ సిబ్బంది క్వార్టర్స్‌లో మురుగునీటి గదిని శుభ్రం చేస్తుండగా ఇద్దరు దళితులు ఊపిరాడక మరణించారు. క్వార్టర్స్‌లో ఉన్న మురుగునీటి బ్లాక్‌ను తొలగించేందుకు కె. మోసెస్‌ (40), సి.దేవన్‌ (50)లను ఒక ప్రయివేటు కాంట్రాక్టర్‌ నియమించాడు. అయితే, వారికి ఎలాంటి భద్రతా పరికరాలు అందించకపోవటంతో ఈ దారుణం చోటు చేసుకున్నదని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్‌, సూపర్‌వైజర్‌ను అరెస్టు చేశారు. కాంట్రాక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ”ఇతర కార్మికులు, వీక్షకులు వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మురికి గది నుంచి కార్మికులను వెలికితీసి ఆస్పత్రికి పంపింది. దేవన్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడు. కానీ మోషే బయటకు తీసుకువచ్చేటప్పటికి చనిపోయాడు. దేవన్‌ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు” అని పోలీసులు వెల్లడించారు.

Spread the love