ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో.. ఇద్దరు మాజీ అదనపు ఎస్పీలపై

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో.. ఇద్దరు మాజీ అదనపు ఎస్పీలపై– స్పెషల్‌ టీం గురి
– ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి డబ్బులు మోసినట్టు ఆరోపణలు
– ఇందులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకూ భాగం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిది
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తాజాగా మరో ఇద్దరు మాజీ అదనపు ఎస్పీలపై స్పెషల్‌ టీం దర్యాప్తు అధికారులు దృష్టిని సారించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయా? అనే విషయమై లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికి ఈ కేసులో విచారణ జరిపిన నగర టాస్క్‌ఫోర్స్‌ మాజీ డిప్యూటీ కమిషనర్‌ రాధాకిషన్‌రావు ఇచ్చిన సమాచారం మేరకే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మాజీ అదనపు ఎస్పీ విద్యాచరణ్‌రావుతో పాటు పేరు వెల్లడి కాని మరో అదనపు ఎస్పీలు.. వెంకట్రామరెడ్డికి ఎన్నికల సమయంలో తరచుగా డబ్బులను పంపించేవారని దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. ఈ విషయంలో రాధాకిషన్‌రావు సైతం తోడ్పాటును అందించేవారని తెలుస్తున్నది. తనకు అందిన డబ్బులను ఎన్నికల సమయంలోనే వెంకట్రామరెడ్డి.. రాధాకిషన్‌రావు ద్వారా ఇతర అభ్యర్థులకు పంపించేవారని కూడా దర్యాప్తులో బయటపడ్డట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే విద్యాచరణ్‌రావు, మరో అదనపు ఎస్పీలకు ఈ కేసుతో ఉన్న సంబంధాలపై స్పెషల్‌ టీం అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. తన టీంకు చెందిన ఒక ఎస్సైకి మాయామాటలు చెప్పి రాధాకిషన్‌రావు తాను సీజ్‌ చేసిన రూ. లక్షల డబ్బులను పోలీసు వాహనంలోనే తాను అనుకున్న గమ్యానికి చేర్చేవాడని కూడా స్పెషల్‌ టీం దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా సదరు టాస్క్‌ఫోర్స్‌ ఎస్సైని రాధాకిషన్‌రావు ఎస్కార్ట్‌గా వాడుకునేవాడనీ, ‘కారులో ఏముంద’ని అడిగితే.. ‘అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం, మన పని డ్యూటీ చేయటం వరకేన’ంటూ రాధాకిషన్‌రావు దాటవేసేవాడని కూడా దర్యాప్తు అధికారులకు వెల్లడైనట్టు తెలిసింది.
2018 నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఫోన్‌ట్యాపింగ్‌ల ద్వారానే రూ. కోట్ల డబ్బులను సీజ్‌ చేసి కొందరు అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు చెందినవారికి అందజేసినట్టు కూడా రాధాకిషన్‌రావు అంగీకరించినట్టు తెలిసింది. వీటన్నిటినీ క్రోడీకరించుకుంటూ దర్యాప్తును ముందుకు సాగిస్తున్న స్పెషల్‌ టీం అధికారులు.. దొరికే ఆధారాలను బట్టి విద్యాచరణ్‌రావు, మరో అదనపు ఎస్పీని ప్రశ్నించటానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Spread the love