Sunday, May 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅప్పు తీర్చాలన్నందుకు ఇద్దరు మహిళల దారుణ హత్య

అప్పు తీర్చాలన్నందుకు ఇద్దరు మహిళల దారుణ హత్య

- Advertisement -

• మొయినాబాద్ ఫామ్‌‌హౌస్‌ ‌సమీపంలో 
 పాతిపెట్టిన దుండగులు
• వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలనం
• మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
• పోలీసుల అదుపులో నిందితులు
నవతెలంగాణ-చేవెళ్ల

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇద్దరు మహిళల మిస్సింగ్ కేసులను పోలీసులు చేధించారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి అడిగినందుకు ఇద్దరు మహిళలను వేర్వేరుగా హత్య చేసి ఫామ్ హౌస్ సమీపంలో పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం కాశీంపూర్‌కు చెందిన అంగన్‌వాడీ ఆయా అబిదా బేగం(62) ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమారుడు ఈ నెల 9న బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాండూరుకు చెందిన కరీం బీ, ఆమె భర్త రెహమాన్‌, మొయినాబాద్ మండలం తోల్కట్ట పరిధిలోని దాసరి పద్మ ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డు నయీమ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో సంచలన నిజాలు బయటపడ్డాయి. రెండు నెలల కిందట అదృశ్యమైన తాండూరుకు చెందిన మహబూబా బేగం(55)ను కూడా ఇదే ముఠా హత్య చేసినట్టు తేలింది
.
అప్పు తిరిగి అడగడంతోనే..
అబిదా బేగం వద్ద నిందితులు రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ డబ్బులు తిరిగి అడగడంతో ఇస్తామని నమ్మించి తోల్కట్టలోని ఫామ్ హౌస్‌కు పిలిపించి సెక్యూరిటీ గార్డు నయీమ్ సహకారంతో హత్య చేశారు. అలాగే మహబూబా బేగం వద్ద మూడు నెలల కిందట నిందితులు రూ.20 వేల అప్పు తీసుకున్నారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి ఆమెను కూడా నమ్మించి ఫామ్ హౌస్‌కు పిలిపించి చంపేశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను ఫామ్‌ ‌హౌస్‌ ‌సమీపంలోనే పాతిపెట్టారు. ఆ ఇద్దరి మెడల్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. శనివారం పోలీసులు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ముందుగా మహబూబా బేగం మృతదేహాన్ని వెలికి తీయగా, ఆమెకు సంబంధించిన వెంట్రుకలు, ఎముకలు మాత్రమే లభించాయి. అనంతరం కొద్ది దూరంలో పాతిపెట్టిన అబిదా బేగం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -