గుంటూరులో డ్రగ్స్‌ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్టు

నవతెలంగాణ – గుంటూరు
తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకుల్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ నివాసం ఉంటున్న తాడేపల్లికి సమీపంలో ఇది జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే మిల్క్‌ డెయిరీ ఎంట్రెన్స్‌ రోడ్డు దగ్గర ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం త్రినాథపురానికి చెందిన యాగంటి శ్రీచంద్‌ అలియాస్‌ చందు, తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన షేక్‌ రషీద్‌లను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 10 గ్రాముల ఎంఈటీహెచ్‌ అనే మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తాడేపల్లి సీఐ శేషగిరిరావు శుక్రవారం తెలిపారు. చందు ఆ మాదకద్రవ్యాన్ని దిల్లీకి చెందిన వాసు అనే వ్యక్తి నుంచి తెప్పించుకుని, దాన్ని విక్రయించేందుకు రషీద్‌కు ఇస్తుండగా అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ‘‘చందు పంజాబ్‌లోని ఒక యూనివర్సిటీలో చదువుతుండగా డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. దిల్లీకి చెందిన వాసుతో పరిచయం పెంచుకుని, అతని ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసేవాడు. విషయం తెలిసి చందు తల్లిదండ్రులు అక్కడ చదువు మాన్పించేశారు. ప్రస్తుతం వడ్డేశ్వరంలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ శిక్షణ పొందుతున్నాడు. చుట్టుపక్కల కొందరు కుర్రాళ్లు గంజాయి వంటివి తాగడం చూసి, ఇక్కడ మత్తు పదార్థాలకు గిరాకీ ఉందని భావించాడు. వడ్డేశ్వరంలోని రషీద్‌ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. దిల్లీ నుంచి డ్రగ్స్‌ రప్పించి ఇచ్చి అమ్మినందుకు కమీషన్‌ ఇస్తున్నాడు’ అని సీఐ తెలిపారు.

Spread the love