ఆర్మీ మేజర్‌ రాధికకు ఐరాస అవార్డ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ఆర్మీలో మేజర్‌‌గా సేవలు అందిస్తున్న రాధికా సేన్‌ అనే అధికారిణికి ఐక్యరాజ్యసమితి అవార్డ్ దక్కింది. 2023 ఏడాదికిగానూ ‘మిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ఆమె అందుకున్నారు. యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గురువారం ఈ పురస్కారాన్ని అందజేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్‌ రాధికా సేన్‌ 2023 ఏప్రిల్‌లో ‘డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’కు వెళ్లి విశేషమైన సేవలు అందించారు. కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింసను నిరోధించేందుకు రాధికా సేన్ చొరవచూపారు. అక్కడ శాంతి పరిస్థితుల కోసం ఆమె విస్తృత ప్రచారం చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస నిరోధానికి రాధికా సేన్‌ కృషి చేశారని, ఆమె చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేసినట్టుగా గుటెర్రెస్ వెల్లడించారు. రాధికను నిజమైన నాయకురాలు అని, ‘రోల్ మోడల్‌’ అని గుటెర్రెస్ అభివర్ణించారు. కాగా కాంగోలోని నార్త్‌ కీవో ప్రాంతంలో రాధికా సేన్‌ సేవలు అందించారు.

Spread the love