బీజేపీ పాలనలో దిగజారిన అట్టడుగు ప్రజల స్థితిగతులు

Under the rule of BJP, the condition of the lower class people has deterioratedపద్దెనిమిదవ పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియలో భారతదేశం గందరగోళంలో ఉండడం వల్ల ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన భయాందోళనలు నెలకొని ఉన్నాయి. మొత్తం 543 స్థానాల్లో 400 పైచిలుకు స్థానాల్లో తాము విజయం సాధిస్తామని పాలక భారతీయ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తుండగా, 150 నుంచి 180 స్థానాలకు మించి బీజేపీ విజయం సాధించదని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం లోని ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి చెపుతున్నది.
1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌)కు బీజేపీ రాజకీయ అనుబంధ సంస్థ. ఆరెస్సెస్‌ లక్ష్యాలు, దాని ఎజెండా గురించి ఆరెస్సెస్‌ స్థాపన, దాని మూలాలు చాలా విషయాలు తెలియజేస్తాయి. మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజానీకం వలస దోపిడీ సంకెళ్లను అధిగమిస్తూ బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయం అది. దళితులు (అణగారిన, శ్రేణీగత వ్యవస్థలో అట్టడుగు వర్గాలవారు), భూస్వాముల- మతాచార్యుల (బ్రాహ్మణ) కలయికకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న సమయం అది. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి ముప్పు ఏర్పడిన కారణంగా ఉన్నత శ్రేణి ప్రముఖులంతా ఆరెస్సెస్‌ స్థాపన కోసం 1925లో ఏకమయ్యారు. లౌకిక, ప్రజాస్వామిక దేశం కోసం జరుగుతున్న జాతీయోద్యమానికి భిన్నమైన రీతిలో హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే ఆరెస్సెస్‌ వారి లక్ష్యంగా ఉంది. ఆ క్రమంలోనే అది 1951లో భారతీయ జనసంఫ్‌ును స్థాపించి, దాని స్థానంలో 1980లో భారతీయ జనతాపార్టీకి పునర్జన్మనిచ్చింది.
ఆరెస్సెస్‌కు రెండు ఆధార నియమాలున్నాయి: ఒకటి, ముస్లింలు, క్రైస్తవులను ‘విదేశీ మతాల’కు చెందిన వారుగా పరిగణించడం. రెండు, కులం, వర్గం, లింగ శ్రేణీగత పుట్టుక పై ఆధారపడిన కాలం నాటి ‘స్వర్ణ గతాన్ని’ (గోల్డెన్‌ పాస్ట్‌) పునరుద్ధరించడం. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండడమే నేటి ఆరెస్సెస్‌ వారి ప్రధాన ఎజెండాగా కనపడుతుంది. అదే విధంగా అది, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారిని, స్వదేశీయులను, మహిళలను పూర్తిగా అణచి వేయడానికి పూనుకుంటున్నది. సమాజంలోని ఈ వర్గాల పట్ల ఆరెస్సెస్‌ రెండు మార్గాల విధానాన్ని అవలంబిస్తున్నది. ఒకవైపు బీజేపీ మొత్తం విధానాలు ఈ వర్గాలకు హాని కలిగిస్తున్నది. మరోవైపు సమాజంలోని ఈ వర్గాల వారికి సహకరించడానికి వారు కొన్ని సంస్థలను స్థాపిస్తున్నారు. ముస్లిం లకు సంబంధించినంత వరకు, 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశం మొత్తం జనాభాలో వారు 14.2శాతం ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ నినాదం ఇచ్చినప్పటికీ ముస్లింల అణచివేత చాలా స్పష్టంగా కనపడు తున్నది. ముస్లింలలో ఒక వర్గం వారిని ముఖ్యంగా షియాలు, పాస్మండాలు, సూఫీల మద్ధతు కోసం వారు రాష్ట్రీయ ముస్లిం మంచ్‌ (ముస్లింలకు జాతీయ వేదిక)ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పార్లమెంట్‌ ఉభయసభల్లో బీజేపీకి 395 మంది ఎంపీలు ఉంటే వారిలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేడు. 57 మంది మంత్రులతో కూడిన మోడీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి లేడు. ముస్లింలపై అఘాయిత్యాలకు సంబంధించి, గత పదేండ్లలో ముస్లింలపై 2019లో ఢిల్లీలో పెద్ద ఎత్తున హింస జరిగింది. ముస్లింలకు పౌరసత్వం ఇవ్వకుండా మినహాయించిన కొత్త పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన నిరసనల తరువాత ఆ హింస చోటు చేసుకుంది. ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ లెక్కల ప్రకారం చంపబడిన 53 మందిలో 38 మంది ముస్లింలే.
మొత్తంగా చూస్తే గొడ్డు-ఆవు మాంసం సమస్యపై ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం భయం, బాధ కలిగిస్తుంది. దాద్రీలో అఖ్లఖ్‌ హత్య నుండి రైల్లో జరిగిన జునైద్‌ హత్య వరకు దాదాపు 100 హత్య కేసులు నమోదు అయ్యాయి. ”వీటిలో 97శాతం కేసులు, 2014 మేలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే నమోదయ్యాయి. నమోదైన 63 ఆవు సంబంధిత కేసుల్లో దాదాపు 32 కేసులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని” బిజినెస్‌ స్టాండర్డ్‌ వార్తాపత్రిక పేర్కొంది.
”లవ్‌ జీహాద్‌”, మతాంతర (అమ్మాయి హిందువైతే) వివాహాలను ముస్లిం యువతకు వ్యతిరేకంగా జరిగే హింసకు సాకుగా చూపుతున్నారు. ముస్లింలను లక్ష్యం చేసుకునే సమస్యలు చాలానే ఉన్నాయి. ”ముస్లింలకు వ్యతిరేకంగా క్రమపద్ధతిలో వివక్ష చూపే, ప్రభుత్వ విమర్శకులను నిందించే చట్టాల్ని, విధానాల్ని భారతదేశంలో అధికారులు అవలంబిస్తు న్నారు. హిందూ జాతీయవాద భారతీయ జనతాపార్టీ పాలక ప్రభుత్వ పక్షపాత వైఖరి, పోలీస్‌ వ్యవస్థ, కోర్టులు లాంటి స్వతంత్ర సంస్థల్లోకి ప్రవేశించింది. అది, మైనార్టీ మతస్తులను బెదిరించి, వేధించి, దాడిచేసే విధంగా హిందూత్వ అల్లరి మూకలకు అధికారం ఇస్తున్నది. వీరికి శిక్షల నుండి మినహాయింపు ఉంటుంది.
క్రైస్తవ సమాజం కూడా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నది. 1999లో పాస్టర్‌ గ్రాహం స్టీవార్డ్‌ స్టెయిన్స్‌ను సజీవ దహనం చేసిన ఘటనను, ప్రపంచ అమానుష చర్యల జాబితాకు చెందిన ఘటనగా నాటి భారతరాష్ట్రపతి కే.ఆర్‌.నారాయణన్‌ పేర్కొన్నాడు. విశ్రాంత న్యాయమూర్తి ఏ.పీ.మూర్తి నాయకత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసిన జ్యూరీ, ఈ కేసు విచారణను చేపట్టింది. ”ఈ సంఘటన జాతికి అవమానం, మానవజాతికి విఘాతం” అని షా వ్యాఖ్యానించాడు. ఈ హింసలో దాదాపు 100 మంది క్రైస్తవులు హత్యకు గురయ్యారు. 300 చర్చ్‌లు ధ్వంసం చేయబడ్డాయి.
మిషనరీలు మతమార్పిడి కోసం ప్రయత్నం చేస్తున్నాయనే సాకుతో ప్రార్థనా సమావేశాలపై దాడులు జరుగుతున్న మారుమూల ప్రాంతాల్లో తక్కువ తీవ్రతతో క్రైస్తవ వ్యతిరేక దాడులు కొనసాగుతున్నాయి. ”23 జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. భారతదేశంలో మూడు రాష్ట్రాల్లోని 13 జిల్లాల్ని క్రైస్తవ మతాన్ని ఆచరించడానికి ప్రమాదకరమైన జోన్లుగా గుర్తించారని” ద సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌ సంస్థ తెలిపింది. క్రైస్తవులు జీవించడానికి భారతదేశం పదో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించారని ‘ఓపెన్‌ డోర్స్‌’ పేర్కొంది.
ఈ నేపథ్యంలో మోడీ, కొందరు క్రైస్తవ మత పెద్దల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ”డిసెంబర్‌ 25వ తేదీన మోడీ క్రైస్తవ ప్రతినిధులను పరస్పర చర్చల కోసం, వారిని అభినందించడం కోసం ఆహ్వానించాడు. క్రైస్తవ సమాజం చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించి, ఏసుక్రీస్తు బోధనలను ఆయన కొనియాడాడని” ఇండియన్‌ కరెంట్స్‌ పేర్కొంది. సేవల ద్వారా దళితుల మద్దతు సాధించడానికి బీజేపీ, సామాజిక సామరస్య మంచ్‌ లాంటి కొన్ని సంస్థల్ని ప్రారంభిస్తున్నది. విధానపరమైన విషయాల్లో వారు అణగారిన వర్గాల కోసం నిశ్చయీకరణ చర్యలను దాట వేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ, న్యాయం కోసం పిలుపునిస్తుంటే, భారతీయ జనతాపార్టీ విధాన పరంగా అవకాశం ఉన్న చోట, భారతదేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రధాన సాధనంగా ఉపయోగపడే రిజర్వేషన్లను తొలగిస్తున్నది. గడచిన దశాబ్ద కాలంలో ఈ వర్గాల ఆర్థిక స్థితిగతులు మరింతగా దిగజారాయి.
”పట్టణ ప్రాంతాల్లో దళితులు, నైపుణ్యం లేని ఉద్యోగాలు, రెక్కల కష్టం చేసే ఉపాధిని పొందుతున్నారు. కేవలం 5శాతం మంది దళితులు మాత్రమే భారతీయ రిజర్వేషన్‌ చట్టం నుండి ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రభుత్వ పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు దళితులకు సహాయపడుతుండగా, ప్రభుత్వం వాటిని సరైన రీతిలో పర్యవేక్షించడం లేదు, వాటిలో చాలా వరకు అమలుకు నోచుకోవని” ప్రముఖ విద్యావేత్త సుఖదేవ్‌ థోరత్‌ అన్నారు. వారి ఆర్థిక దుస్థితి దయనీయంగా ఉంది. ప్రజల్లో పెరుగు తున్న ఆగ్రహం 2024 లోక్‌ సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. బీజేపీ చేస్తున్న వాగ్దానాలను అణగారిన వర్గాలు సీరియస్‌గా తీసుకోవడం లేదని యూసీఏ న్యూస్‌ నివేదిక తెలిపింది.
(”న్యూస్‌క్లిక్‌” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌
సెల్‌ : 9848412451
రామ్‌ పునియానీ

Spread the love