పాపం శిరీష

– అంగవైకల్యంతో చిన్నారికి కష్టాలు
– భారంగా మారిన పాప మందుల ఖర్చు
– ఆపన్న హస్తం కోసం ఎదిరిచూపులు
– మనసున్న మహారాజులు స్పందిస్తారని ఆశ
నవతెలంగాణ వర్గల్‌
పిల్లల ఆలనా పాలనా చూడాల్సిన తండ్రి కర్కశంగా మారి కాదన్నాడు. అంగవైకల్యం ఉందని తల్లిని, పిల్లలను ఇంట్లో నుంచి గెంటేశాడు. తల్లిగారి ఇంట్లో తలదాచుకుంటు పాప వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న ఓ తల్లి విషాద గాథపై నవతెలంగాణ ప్రత్యేక కథనం… వర్గల్‌ మండలంలోని తునికి ఖల్సా గ్రామానికి చెందిన గొడుగు ఇస్తరి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవాడు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుతురైన రేణుకను సికింద్రాబాద్‌ దగ్గరలో ఉండే ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేసాడు. వారికి మొదటి సంతానంగా ఓ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు శిరీష(7). ఈ పాపకి పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నది. అంగవైకల్యం ఉన్న అమ్మాయి పుట్టిందని భార్యతో రోజు గొడవపడేవాడు. అంగవైకల్యం ఉన్న అమ్మాయితో పాటు మరో ఇద్దరు సంతానం కలిగారు. పెద్ద అమ్మాయి శిరీష అంగవైకల్యం తో పాటు ఫీట్స్‌, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. పాప వైద్యం కోసం ప్రతినెలా రూ 6 వేలు ఖర్చు అవుతుందని రోజూ భార్యతో గొడవ పెట్టుకొని ఓరోజు ఇంట్లో నుంచి గెంటేశాడు. భర్త వెల్లగొట్టడంతో రేణుక తల్లిగారి ఇంటికి వచ్చి తలదాచుకుంటున్నది. ముగురు పిల్లను పోషించడానికి నరకయాతన పడుతోంది. రేణుక తండ్రి ఇస్తరి ఈ మధ్యకాలంలో మరణించాడు. తండ్రి మరణంతో ఈ కుటుంబానికి మరిన్ని కష్టాలు తొడయ్యాయి. శిరీషకు వైద్యం చేయించడం కోసం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిరీష ఆరోగ్యం చూసుకుంటూ గ్రామంలోని స్కూల్‌లో రేణుక సహాయకురాలిగా పని చేస్తోంది. ప్రతినెలా శిరీషకు రూ.6 వేలు మందుల ఖర్చు అవుతోంది. మరో ఇద్దరి పిల్లలు ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, దాతలు ఎవరైనా తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రార్థిస్తున్నారు. సహాయం చేసేవారు 7330665413 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Spread the love