నెరవేరని పాలకుల హామీలు

– పత్తి,మిర్చి మార్కెట్‌ ఏర్పాటు నిల్‌
నవతెలంగాణ-మఠంపల్లి
జిల్లాలో అత్యధికంగా పత్తి,మిర్చి పండించే మండలాల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని మేళ్లచెర్వు, మఠంపల్లి, చింతలపాలెం మండలాలు ఉన్నాయి.రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలవగానే తమ పార్టీ అధికారంలోకి రాగానే పత్తి,మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చి ఎన్నికైన తర్వాత ఆ హామీలను మరిచిపోతున్నారు. రైతులు పండించిన పంటలు అమ్ముకోవాలంటే దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని,ఈఎన్నికల్లో నైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు.కొనుగోలు మార్కెట్‌, శీతల గడ్డంగులు కట్టిస్తామని రైతులకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నారు.సాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని చివరిమండలాలైన మఠంపల్లి, మేళ్లచెర్వు,చింతలపాలెం ప్రాంతాల్లో సాగర్‌ కాల్వ నీరు ఏనాడు సరిగా రాదు.దీంతో దశాబ్దాల కాలంగా వర్షదారంతో పండే పత్తి,మిర్చి పంటలు సాగు చేస్తున్నారు.మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం, వెంకటాయపాలెం,గుండ్లపల్లి, పెదవీడు ప్రాంతాల్లో,మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లో పూర్తిగా పత్తి,మిర్చి పంటలు సాగుచేస్తున్నారు.ఆయా మండలాల్లో పత్తి 18 వేల ఎకరాల్లో, 22 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు.ఇంటిల్ల్లిపాది ఆరుగాల కష్టపడి పంట పండిస్తే అమ్ముకునేందుకు అందుబాటులో మార్కెట్‌ సౌకర్యం ఉండదు.దాచుకునేందుకు ప్రభుత్వ గిడ్డంగులు లేకపోవడంతో దళారుల చేతుల్లో మోసపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. 2013లో చింతలపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డిలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు.రాష్ట్రం ఏర్పడిన గతఎన్నికల్లో,ఉపఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చిన హమీ నెరవేరలేదని,వారి మాటలు,వాగ్దానాలు నీటిమూటలుగా మరాయంటున్నారు.రెండు,మూడేండ్లుగా రైతులు,రైతు సంఘాలు ఎన్నో ఆందోళనలు చేయగా ప్రయివేట్‌ గోదాముల్లో కొనుగోలుకేంద్రం ఏర్పాటు చేశారు.దీంతో రైతులు వారి చెప్పుచేతుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.రైతులకు ఇబ్బందులు లేకుండా రాబోయే ఎన్నికల్లో రాతపూర్వక హామీ ఇవ్వాలని రైతులు,రైతుసంఘాలు కోరుతున్నారు.

Spread the love