సర్వమానవ సౌభ్రాతృత్వమే

Universal brotherhood– మఖ్దూం మొహియుద్దీన్‌కు నివాళి
– తెలంగాణ సాహితి ఉర్దూ లిటరరీ ఫెస్ట్‌లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదం లేని సర్వమానవ సౌభ్రాతృత్వమే స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ అభ్యుదయ కవి మఖ్దూం మొయినుద్దీన్‌కు ఇచ్చే అసలైన నివాళి అని పలువురు వక్తలు అన్నారు. మఖ్దూం మొయినుద్దీన్‌ వర్థంతి సందర్భంగా తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఉర్దూ లిటరరీ ఫెస్ట్‌’ నిర్వహించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కే ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ కవి, శాసనమండలి చైర్మెన్‌ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమ కన్వీనర్‌, రచయిత మహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌, ప్రముఖ కవయిత్రి జమీలా నిషాత్‌, పార్సీ, ఉర్దూ భాషావేత్త డాక్టర్‌ రవూఫ్‌ ఖైర్‌, ప్రముఖ కవులు యాకూబ్‌, అబ్దుల్‌ వాహెద్‌, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్‌, తెలంగాణ సాహితి అధ్యక్షులు వల్లభాపురం జనార్థన, ఇస్లామియా సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు సయ్యద్‌ రియాజ్‌ తన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మఖ్దూం మొయినుద్దీన్‌ అభ్యుదయ భావాలు, కవిత్వం, ప్రజా చైతన్యం కోసం చేసిన కృషిని కొనియాడారు. మానవతా సమాజ నిర్మాణం కవిత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారని చెప్పారు. ఉర్దూ భాష ఓ మతానికి సంబంధించినది కాదనీ, అది మానవుల అంతర్జాతీయ భాష అని అభిప్రాయపడ్డారు. భాషతో సహజీవనం నుంచే ప్రేమాభిమానాలు, బంధుత్వాలు ఏర్పడతాయని ఉదహరించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల సమాహారంగా వర్థిల్లుతుందనీ, దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ, ప్రజల మధ్య విభజన తెచ్చే దుష్ట శక్తులను తరిమికొట్టడంలో కవులు, రచయితల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. అనేకమంది ముస్లిం రచయితలు తెలుగులో రచనలు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం పాఠశాలల సంఖ్య తగ్గుతున్నదనీ, ఉర్దూ అకాడమీకి నిధులే లేవని ఆక్షేపించారు. భాషా పరిరక్షణ భాధ్యతను అందరూ స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
మైమరిపించిన ముషాయిరా
తెలంగాణ సాహితి నిర్వహించిన ‘ఉర్దూ లిటరరీ ఫెస్ట్‌’లో కవులు తమ ముషాయిరాను గొప్పగా చదివి వినిపించారు. భాష, అభ్యుదయం, సాహిత్యం, లోకంపోకడ, మతోన్మాద ప్రమాదం, సమాజ కర్తవ్యాలను నిర్దేశిస్తూ కవులు తమ కవితల్ని చదివారు. మూడు సెషన్స్‌లో జరిగిన లిటరరీ ఫెస్ట్‌ రాత్రి వరకు కొనసాగింది. తొలి సెషన్‌కు షేక్‌ సలీమ అధ్యక్షత వహించగా, సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ లిటరేచర్‌ జాతీయ అధ్యక్షులు అబూ నబీల్‌ ఖాజా మసీహుద్దీన్‌ అతిధిగా హాజరయ్యారు. ముజాహిద్‌ సమన్వయ కర్తగా వ్యవహరించారు.
రెండో సెషన్‌కు ఖాజా మొహియుద్దీన్‌ అధ్యక్షత వహించగా, ఎస్వీఆర్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్‌ చైర్మెన్‌ మిన్హాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ అతిధిగా పాల్గొన్నారు. సమన్వయకర్తగా తంగిరాల చక్రవర్తి వ్యవహరించారు.
మూడో సెషన్‌కు వాహెద్‌ఖాన్‌ అధ్యక్షత వహించగా,ఎమ్‌ నరహరి అతిథిగా వ్యవహరించారు. గౌస్‌భాషా సమన్వయం చేశారు. అనంతోజు మోహనకృష్ణ, మేగోటి రేఖ ఫెస్ట్‌ నిర్వహణలో భాగస్వాములు అయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో మఖ్దూం మొయినుద్దీన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రూపొందించిన మఖ్దూం మొయినుద్దీన్‌ కవితలతో కూడిన కేలండర్‌ను ఏనుగు నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. జనవిజ్ఞాన వేదిక బాధ్యులు రాజా తదితరులు పాల్గొన్నారు.

Spread the love