Tuesday, June 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల గుడిసెలపైనే ప్రతాపం..

పేదల గుడిసెలపైనే ప్రతాపం..

- Advertisement -

చెరువు ‘కబ్జా’లను వదిలేసిన అధికారులు
గోపాలపురం చెరువులో తెల్లవారుజామునే 
120 గుడిసెలు నేలమట్టం
కన్నీరుమున్నీరవుతున్న బాధితులు.. 
రోడ్డున పడ్డ బతుకులు
అక్రమ కట్టడాలు వదిలేసి.. 
పేదల పొట్టకొడతారా?
కబ్జాదారులకు కొమ్ముకాస్తూ..
 పేదలపై జేసీబీలా?
పేదలను ఆదుకునే వరకు పోరాడుతాం :
 సీపీఐ(ఎం) హనుమకొండ కలెక్టరేట్ 
ఎదుట ధర్నా

నవతెలంగాణ -నయీంనగర్
గద్దెనెక్కినప్పుడు ‘ప్రజా పాలన’ అని ఊదరగొట్టిన పాలకులు.. క్షేత్రస్థాయిలో మాత్రం పేదలపైనే తమ ప్రతాపం చూపిస్తున్నారు. హనుమకొండ పరిధిలోని గోపాలపురం చెరువు శిఖం భూముల్లో నిర్మించుకున్న పేదల గుడిసెలను సోమవారం సూర్యోదయానికి ముందే రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా నేలమట్టం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, కనీసం సామాగ్రి సర్దుకునేందుకు ఒక్క రోజు సమయం ఇవ్వాలని బాధితులు కాళ్ళు పట్టుకుని బతిమిలాడినా వినకుండా 120 గుడిసెలను జేసీబీలతో కూల్చివేశారు. ఐదేండ్లుగా ఇక్కడే నివాసముంటున్న తమను గుడిసెలు పీకేసి రోడ్డున పడేశారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా గోపాల పురం చెరువు రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 89లో మొత్తం 21 ఎకరాల 3 గుంటలు ఉండాలి. కానీ, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అండతో ఇప్పటికే ఇందులో సుమారు 10 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ అక్రమ కట్టడాలకు అధికారులు గతంలో మార్కింగ్ (గుర్తులు) చేసినప్పటికీ.. వాటిని ముట్టే ధైర్యం చేయలేదు. చెరువు సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న యంత్రాంగం.. మొదట చెరువు భూమిని పూర్తిగా సర్వే చేయించి హద్దురాళ్ళు వేయకుండా, చెరువు సుందరీక రణం అంటూ పూడికతీత పనులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న పేదల గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అక్రమంగా కట్టిన పెద్దపెద్ద భవనాలను మాత్రం అధికారులు వదిలేశారు. అక్రమ కట్టడాలను కూల్చకుండా కేవలం పేదల గుడిసెలను తొలగించి నామమాత్రంగా చేతులు దులుపుకోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

కలెక్టరేట్ ముందు గుడిసెవాసుల ధర్నా..
గోపాలపురం చెరువు వద్ద పేదల గుడిసెలను ముందస్తు నోటీసులు లేకుండా బలవంతంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులతో కలిసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వానికి, అధికా రులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వి. వీరన్న నాయక్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇండ్లు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించే వరకు సీపీఐ(ఎం) బాధితులకు అండగా ఉండి పోరాడుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వి. రాజు, డి. రమేష్, ప్రజా సంఘాల నాయకులు సబిత, పావని, పద్మ, మమత, శృతి, రమాదేవి, సమ్మయ్య, రమేష్, వెంకటేష్, బాధిత గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు.

​ఎలక్షన్లప్పుడు ఓట్లు కావాలి.. 
ఇప్పుడేమో రోడ్డున పడేస్తారా?
ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే వరదలకు, వర్షాలకు, విషప్రాణులకు తట్టుకుంటూ గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. గతేడాది తుఫానుకు సర్వస్వం కోల్పోతే, మళ్లీ అప్పులు చేసి రేకులు కొనుక్కున్నాం. ‘మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటాం’ అని అధికారులను బతిమిలాడినా వినలేదు. వేరే ఎక్కడైనా వేసుకోకుండా ఉండటానికి రేకులను, కర్రలను కూడా జేసీబీలతో విరగ్గొట్టారు.
మూల రమాదేవి (బాధితురాలు)

​తక్షణమే న్యాయం చేయాలి
సుందరీకరణ పేరుతో పేదలను ఇక్కడి నుంచి వెళ్లగొట్టడం అన్యాయం. అక్రమ కట్టడాలపై లేని ప్రతాపం పేదలపై చూపించడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చెరువు భూమిని పూర్తిస్థాయిలో సర్వే చేయించి కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలి. అలాగే ఇండ్లు కోల్పోయి రోడ్డున పడ్డ 120 పేద కుటుంబాలకు తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాలి. చెరువు కట్ట లోపల సైడ్ డ్రాప్ వాల్ కట్టి, హైట్ పెంచడం వల్ల పోచమ్మ గుడి ప్రాంతం, టీఎన్‌జీవోస్ కాలనీ-2, రేణుక ఎల్లమ్మ కాలనీ, ట్రాన్స్‌ఫార్మర్ పక్కన దళిత కాలనీ, అధిక వర్షపాతం నమోదైనప్పుడు ఈ ప్రాంతమంతా మునిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది.
వీరన్న నాయక్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు

​మా బతుకులు రోడ్డున పడ్డాయి..
ఇప్పుడు మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. మమ్ములను ఆదుకునే నాథుడే లేడు. ఇంట్లో నలుగురం ఉన్నాం. ఈ మండుటెండల్లో ఎక్కడ ఉండాలి? ఏం వండుకుని తినాలి? ప్రజా పాలనలో అనేకసార్లు దరఖాస్తు ఇచ్చాను. ఎమ్మెల్యేని కూడా కలిశాను. ఎలక్షన్ల టైంలో ఎంపీ కావ్య మాకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చిన ఏ రాజకీయ నాయకుడూ ‘ఇది చెరువు భూమి, ఇక్కడ ఉండొద్దు’ అని చెప్పలేదు. ఓట్లేమో మావి కావాలి.. గెలిచాక మా బతుకులను రోడ్డున పడేస్తారా? మా ఉసురు తలుగుద్ది. కొంతమంది మట్టి అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు.
-ఎండీ బిల్గేస్ (బాధితురాలు)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -