UPI చెల్లింపుల పరిమితి పెంపు

నవతెలంగాణ ముంబయి: ఆర్‌బీఐ (RBI) శుక్రవారం మరో కీలక ప్రకటనలు చేసింది. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు (Hospitals,Educational Institutes) యూపీఐ (UPI) ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని, రికరింగ్‌ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్ మొత్తాన్ని పెంచినట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ (UPI payments) ద్వారా ఒకసారి రూ.1 లక్ష వరకు ఉన్న పరిమితిని తాజాగా రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభించింది. రికరింగ్‌ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15 వేల నుంచి తాజాగా ఆర్‌బీఐ రూ.1 లక్షకు పెంచింది. ఇప్పటి వరకు ఆటో డెబిట్‌ లావాదేవీ విలువ రూ.15 వేలు దాటినట్లయితే.. ‘అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌’ కింద కస్టమర్లు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలి. తాజా నిర్ణయంతో రూ.1 లక్ష వరకు ఎలాంటి అదనపు అథెంటికేషన్‌ అవసరం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేసే మ్యూచువల్‌ ఫండ్‌ సబ్‌స్క్రిప్షన్‌, బీమా ప్రీమియం, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన పని ఉండదు.

Spread the love