నవతెలంగాణ – అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేమూరు, తెనాలి, బాపట్ల ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామంలో తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చంద్రబాబు రైతులను పరామర్శించారు. మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న బాధిత రైతులు ఆయనతో తమ కష్టాలు చెప్పుకున్నారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో తన స్పందన వెలిబుచ్చారు. “తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగించాయి. చేతికందిన పంట నీట మునిగిన వేళ… రైతుల కష్టం చూస్తే బాధేస్తోంది. కౌలు రైతులు మరింత కుదేలయ్యారు. ప్రభుత్వం వెంటనే బాధిత రైతులను ఆదుకోవాలి. అన్నదాతకు పరిహారంపై ఉదారంగా వ్యవహరించాలి. గ్యారెంటీ లేకుండా పోయిన రైతన్నకు సాగు కొనసాగించేలా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి” అని చంద్రబాబు ట్వీట్ చేశారు. వరి పంటను పరిశీలించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.